ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూరుగడ్డ గ్రామ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు బదిలీ చేసిన కంప్యూటర్​ఆపరేటర్ వత్సవాయి జగదీశ్​ను టర్మినేట్ చేసినట్లుగా తెలిపారు.

హుజుర్ నగర్ మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించిన కలెక్టర్ కు అనుమానం వచ్చి బూరుగడ్డ రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సిందిగా ఆర్డీవో శ్రీనివాస్​ను ఆదేశించారు.

బూరుగడ్డ గ్రామాల్లోని సర్వే నంబర్లు 439, 604 ,602 ,608, 1041, 1041 గల ప్రభుత్వ భూమిని కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల పేర్లపై మార్పిడి చేసినట్టుగా గుర్తించారు. బూరుగడ్డ హుజూర్​నగర్ లోని మొత్తం 36 ఎకరాల 23 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పోర్టల్​లో నమోదు చేసినట్లు విచారణలో తేలింది.

నవంబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 మధ్య కాలంలో కంప్యూటర్​ఆపరేటర్ తమ బంధువుల పేరుపై ఆ భూములను మార్పిడి చేశారని అప్పటి తహసీల్దార్, ఇతర అధికారులపై కూడా విచారణ జరిపించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతను విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ నియమించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ తెలిపారు.