యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలి 

  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రజవాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షంతో అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామన్నారు. వర్షం కారణంగా తెగిపోయిన కాలువ, చెరువులు కట్టలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కరెంట్ స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

పంట నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రత్యేకాధికారులు సందర్శించి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. నేటి ప్రజావాణి లో మొత్తం 84  దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, జడ్పీ సీఈవో అప్పారావు, డీఎఫ్ వో సతీశ్ కుమార్, డీఈవో అశోక్, డీఎంహెచ్​వో కోటాచలం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

వాగును కబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి..

వాగును కబ్జా చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోతె మండల పరిధిలోని వెనే తండాకు చెందిన రైతులు సోమవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోతె మండలం సిరికొండ రెవెన్యూ శివారు సర్వే నంబర్ 768,769 లో ఉన్న నల్లెన వాగును  గ్రామానికి చెందిన తేజావత్ జానమ్మ, భర్త తారా సింగ్ ఆక్రమించుకున్నారని తెలిపారు. అటువైపు రైతులు, పశువులను వెల్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.