45 రోజుల్లో ‘డబుల్’ ఇండ్లను పూర్తిచేయాలి :  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 45 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట మండలం కేసారం వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఫేజ్–2 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. విద్యుత్, వాటర్ సంప్, సెప్టిక్ ట్యాంక్ పనులు యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సూర్యాపేట మండలం తాళ్ల ఖమ్మం పహాడ్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ పవన్ కుమార్, ఆర్ఐ శ్రీధర్, ఇన్​చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు చాంప్ల, టీచర్లు ఉన్నారు.

 కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


పెన్ పహాడ్, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. పెన్​పహాడ్​ మండలం అనాజిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న, దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దొడ్డు రకం వడ్లు క్వింటాల్​కు రూ.2320, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ కలిపి రూ.2820 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.