ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రైతులకు సూచించారు. మంగళవారం చివ్వేంల మండలం దూరాజ్ పల్లి బ్రాహ్మణ సదన్ లో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆయిల్ పామ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. 

నీటి వసతి ఉంటే వరికి బదులుగా ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో  కలిసి కలెక్టర్ ప్రారంభించారు. 

కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య, ఆగ్రోనామిస్ట్ సుబ్బారావు, పతాంజలి డీజీఎం యాదగిరి, ఉద్యానవన అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు,రైతులు పాల్గొన్నారు.