మట్టి తరలిస్తే డబ్బు వసూళ్లా..!.. ఇరిగేషన్ ఎస్సీపై కలెక్టర్ సీరియస్

  •      నకిలీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
  •      రోడ్ల రిపేర్ పనులు పూర్తి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ ఆదేశం 

కామారెడ్డి​, వెలుగు:  కామారెడ్డి జడ్పీ మీటింగ్ వాడీవేడీగా సాగింది.  శుక్రవారం చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో కలెక్టర్ జితేశ్. వి. పాటిల్ బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు , ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ..  చెరువుల్లోని నల్లమట్టిని రైతులు తీసుకెళితే ఇరిగేషన్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.  

దీనిపై కలెక్టర్ సదరు అధికారులపై సీరియస్ అయ్యారు.  ఈ విషయంపై ఇరిగేషన్ ఎస్సీ కూడా సరైన సమాధానం చెప్పకపోగా..  మైనింగ్ అధికారులు చార్జీ వసూలు చేశారని అనడంతో కలెక్టర్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

నకిలీ విత్తనాల రాకుండా చర్యలు తీసుకోవాలి

గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటు, ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా మారాయని సభ్యులు ఆరోపించారు.  రోడ్లకు రిపేర్లు చేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.  వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు.   ఫండ్స్ ఉన్న వాటితో  రిపేర్ చేస్తున్నామని, మెయిన్ రోడ్ల నుంచి గ్రామాలకు వెళ్లే  రోడ్లకు కూడా రిపేర్ చేస్తామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.  వానాకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ లో  విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.  

నకిలీ విత్తనాల  విక్రయదారుల పట్ల  కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్ చేయాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 4,600  క్వింటాళ్ల జిలుగు, 1343 క్వింటాళ్ల జనుము విత్తనాలను అందజేశామని, అదనపు కేటాయింపుకు ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు.  ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తుందని  ప్రకటించిన విషయాన్ని రైతులకు తెలిపి సన్న ధాన్యం పండించేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కలిగించాలన్నారు.

కొత్తగా ఏర్పడిన మండలాల్లో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  సాధారణ కాన్పులు పెరిగేలా చూడాలన్నారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందించాలన్నారు.  అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద 947 పాఠశాలలో విద్యుత్, మంచినీరు, టాయిలెట్స్, చిన్న చిన్న మరమ్మతు పనులు గుర్తించి చేపట్టామన్నారు.  గతంలో టాయిలెట్స్ యూనిట్ల నిర్మాణానికి  2 ,3 లక్షల వరకు ప్రతిపాదనలు పంపగా, ఇప్పుడు రూ. లక్షలోపే నిర్మించేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు.  

రెండు, మూడు సంవత్సరాల నుంచి వితంతు పింఛన్లు మంజూరు కావడం లేదని సభ్యులు ప్రశ్నించారు.  ఇదే చివరి జడ్పీ సమావేశమని, గత ఐదేండ్ల నుంచి సభలు, సజావుగా నిర్వహించి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి  తెచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు చైర్  పర్సన్ శోభ కృతజ్ఞతలు తెలిపారు.  జడ్పీ సీఈవో చందర్,  జడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.