ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సత్య ప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆఫీసర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 17 వినతులు స్వీకరించారు. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెకు చెందిన ముల్లె రాజవ్వ–నారాయణ వృద్ధ దంపతులు తమ కొడుకు అన్నం పెట్టడం లేదని, మందులు కావాలని అడిగితే విషం గోలీలు వేసుకొని చావమంటున్నాడని కలెక్టర్ సత్య ప్రసాద్‌‌కు ఫిర్యాదు చేశారు.

తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, రవీందర్, శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. జగిత్యాల పట్టణం వాణినగర్‌‌‌‌లోని ధర్మశాల దేవాలయ భూముల్లో అన్యమతస్తుల షెడ్లు తొలగించాలని  విశ్వహిందూ పరిషత్ సభ్యులు కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామస్తులు తమ గ్రామంలోని వందమందికి రుణమాఫీ కాలేదని కలెక్టరేట్‌‌కు వచ్చారు.

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు

రాజన్న సిరిసిల్ల, వెలుగు:ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్​ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో 79 ఫిర్యాదులు వచ్చాయని, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సూచించారు.

గ్రీవెన్స్ డే దరఖాస్తులను పరిష్కరించాలే

వివిధ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ ఆఫీసులో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. భూతగాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి 17 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.