నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద మంజూరయ్యే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను టీవీ లైవ్‌లో వీక్షించిన ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3,500 ఇండ్లు మంజూరు చేస్తున్నారని నిరుపేద మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, ట్రాన్స్జెండర్లు, గిరిజన దళిత కుటుంబాలకు తొలి విడతలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అర్హులైన వారే సెలెక్ట్ అయ్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సర్వే చేస్తామన్నారు. ఇందుకోసం గ్రామ, మున్సిపల్ డివిజన్, వార్డులకు సర్వే టీం వస్తుందన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు అందిస్తామన్నారు. పేద కుటుంబాలకు ఆశ్రయం కల్పించే స్కీంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా సర్కారు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. అదనపు కలెక్టర్అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.