అనాథ బాలల కోసం భవిష్యజ్యోతి  ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: అనాథ బాలలకు విద్య అందించి వారి ఉజ్వల భవిష్యత్​కు బాటలు వేయాలనే సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఈ ట్రస్ట్ కు దాతలు తమవంతు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.  అనాథ పిల్లల కోసం డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రస్ట్ ను శనివారం ప్రారంభించారు.

   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాథ బాలికలకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్​కు బాటలు వేయాలనే దృక్పథంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నెలకొల్పిన ట్రస్ట్ కు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సాధారణంగా న్యాయ సేవాధికార సంస్థలు లోక్ అదాలత్ ల నిర్వహణ, న్యాయ పరమైన అంశాలపై అవగాహన సదస్సులు వంటి వాటికే పరిమితమవుతాయని, అందుకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుండడం ప్రశంసనీయమన్నారు.

 అనాథ బాలలకు ఉచితంగా ప్రవేశాలు కల్పించిన కాకతీయ స్కూల్, రవి పబ్లిక్ స్కూల్, నిర్మల హృదయ్ పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు. జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ.. నిజామాబాద్ బాలసదన్ లో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలకు  భవిష్యత్తు కల్పించేందుకు  భవిష్య జ్యోతి ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు.  నలుగురు అనాథ బాలలను  పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ దత్తత తీసుకున్నారని తెలిపి ఆయనను అభినందించారు.  కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని తదితరులు  పాల్గొన్నారు.   

ఏటీసీ  నిర్మాణ పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్ సిటీ వెలుగు:  జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.  నిజామాబాద్ లోని శివాజీనగర్ ప్రభుత్వ బాలుర, బాలికల ఐటీఐ ప్రాంగణాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల పనులను శనివారం పరిశీలించి పలు సూచనలు  చేశారు.