- నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలపై కలెక్టర్ సీరియస్
- ఆరోగ్యశ్రీ వర్తించే పేషెంట్ నుంచి బిల్ వసూలుపై ఆగ్రహం
- నగరంలో బాలింత మృతికి పరిహారం చెల్లింపుపై విచారణ
- గర్భాశయం తొలిగించిన ఘటనపై ఎంక్వైరీ
- ఆర్మూర్ లో బాలింత మృతిపై సీరియస్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్లో జరుగుతున్నవరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 15 రోజులుగా నిజామాబాద్, ఆర్మూర్ పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై విచారణ చేయాలని డీఎంహెచ్ వో కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రైవేటు హాస్పిటల్స్ లో జరిగిన ఘటనలపై డిప్యూటీ డీఎంహెచ్ వో అంజన విచారణ ప్రారంభించారు.
నవీపేట మండలం నిజాంపూర్ విలేజ్ కు చెందిన పిట్ట నారాయణ(36) ఈ నెల 8 చాతి నొప్పితో నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని10 వతేదీన ఆరోగ్య శ్రీ కింద అప్రూవల్ తీసుకుని రూ. 80 వేల బిల్లు కట్టించుకున్నారు. 16వ తేదీన ఐసీయూకు షిప్టు చేసి పేషెంట్ ను కుటుంబ సభ్యులు చూడనీయకుండా హాస్పిటల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అనుమానం వచ్చి చూడగా.. బెడ్ పై నారాయణ చనిపోయి ఉన్నాడు. డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేశారనే ఆరోపణలో నాలుగో టౌన్ లో కేసు నమోదు కాగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నారు.
- బాన్సువాడకు చెందిన 24 ఏండ్ల మహిళ ప్రసవం కోసం నగరంలోని ఖిల్లా ఏరియాలోని ఓ నర్సింగ్ హోంకు రాగా.. గత నెల 17న చేరగా అమ్మాయి పుట్టింది. 25న తల్లీ బిడ్డలను డిశ్చార్జ్ చేసుకొని భర్త ఇంటికి తీసుకెళ్లగా అదే రాత్రి విపరీతమైన కడుపునొప్పి, రక్తస్రావంతో మళ్లీ అదే హాస్పిటల్ కు తీసుకువచ్చారు. తర్వాత వచ్చిన డాక్టర్ సిటీలోని మరో ఆస్పత్రికి బాలింతను రిఫర్ చేసింది. అధిక రక్తస్రావం అవుతున్నట్లు నిర్దారించిన అక్కడి డాక్టర్ తల్లి ప్రాణం నిలపడానికి సర్జరీ చేసి గర్భాశయాన్ని రిమూవ్ చేశారు. మరోసారి తల్లినయ్యే అవకాశం లేకుండా చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ డీఎంహెచ్ వో విచారణ ప్రారంభించారు.
- నిజామాబాద్ జిల్లా కల్లూరు విలేజ్ కు చెందిన కంఠం స్రవంతి (35) మొదటి సంతానం తర్వాత16 ఏండ్లకు మళ్లీ గర్భం దాల్చింది. నాలుగు నెలల గర్భంతో ఖలీల్ వాడీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు గత 27న వెళ్లగా పిండం ఎదుగుదల సరిగా లేదని అబార్షన్ మందులు ఇచ్చి ఇంటికి పంపారు. ఆమె కు తీవ్రంగా బ్లడ్ పోతుందని స్రవంతి భర్త డాక్టర్ కు ఫోన్ చేయగా.. ఏమీ కాదని మరుసటి రోజు రమ్మన్నారు. 28 తేదీ మరో హాస్పిటల్ కు తరలించగా.. ఆమె చనిపోయింది. దీంతో కుటుంబీకులు రోడ్డుపై ఆందోళన చేయడంతో హాస్పిటల్ మేనేజ్ మెంట్ రూ.10 లక్షల పరిహారం చెల్లించారు.
- ఆలూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన పిట్ల సుమలత (25)కు ఇంతకు ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. మూడవ కాన్పు కోసం భర్త ఆర్మూర్లోని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించగా డాక్టర్ సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన సుమలత ఈ నెల 10న మృతి చెందింది.
- రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన పోతంగల్ విలేజ్ కు చెందిన సిద్ధి నయీమ్ డెడ్ బాడీకి చేసిన ట్రీట్మెంట్, ద్వారాక నగర్‌లోని పిల్లల హాస్పిటల్ లో ఇందల్వాయి విలేజ్ కు చెందిన జగదీశ్ అనే ఐదేళ్ల బాలుడి మృతిపై విచారణ జరుగుతోంది.
- గర్భాశయం తొలగింపుపై విచారణ ప్రసవం తర్వాత బాలింత గర్భాశయం తొలగించిన ఘటనపై సోమవారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంజన విచారణ నిర్వహించారు. బాధితురాలి కంప్లైట్ మేరకు కలెక్టర్ రాజీవ్ గాంధీ ఆదేశాలతో ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లిన ఆమె అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. కాన్పు కోసం చేరిన గర్భిణికి అందించిన ట్రీట్మెంట్ రికార్డు మొత్తాన్ని ఆమె పరిశీలించారు. డిశ్చార్జ్ టైంలో తల్లీ బిడ్డ హెల్త్ కండిషన్ చెక్ చేయడానికి పాటించిన పద్ధతులు తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్ కు అందిస్తామని డిప్యూటీ డీఎంహెచ్ వో అంజన తెలిపారు.