కరీంనగర్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఇందిరమ్మ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,10,677 దరఖాస్తులు వచ్చాయన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 80.77 శాతం సర్వే పూర్తయిందన్నారు. గ్రామాల్లో 87.04 శాతం, మున్సిపాలిటీలైన జమ్మికుంటలో 96.94 శాతం, హుజూరాబాద్ లో 90.75 శాతం, చొప్పదండిలో 84.01 శాతం, కొత్తపల్లిలో 72.15 శాతం కాగా కరీంనగర్ కార్పొరేషన్పరిధిలో 55.26 శాతం సర్వే పూర్తయినట్లు వివరించారు. సిటీలో సర్వే స్పీడప్ చేయాలన్నారు. డిసెంబర్ 31లోపు 100 శాతం పూర్తి చేయాలన్నారు.
అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రీవెన్స్ లో స్వీకరించిన 240 అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ పాల్గొన్నారు.