సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలి : కలెక్టర్ పమేలా సత్పతి

  • అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2024 జిల్లా స్థాయి పోటీలు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా జట్లు సత్తా చాటాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. సీఎం కప్ 2024 పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లోని మెరికల్లాంటి ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. కరీంనగర్‌‌‌‌లోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలను కలెక్టర్‌‌‌‌ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె జ్యోతి వెలిగించి ఒలింపిక్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రారంభించిన సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. 

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని అందులో భాగంగానే సీఎం కప్ క్రీడలను గ్రామీణ స్థాయి నుంచి నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ డీవైఎస్‌‌వో శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, స్థానిక కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నందలి మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.