‘సీఎస్సీ‘ వాహన సేవలు పకడ్బందీగా అందించాలి : కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు :  కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) వాహనసేవలను పకడ్బందీగా అందించాలని అడిషనల్​కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాకు కేటాయించిన సీఎస్సీ వాహనాన్ని ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.  

దీని ద్వారా ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, వైద్య, విద్య, ఉపాధి, ఈ మొబిలిటీ, గ్రామీణ ఈ స్టోర్, న్యాయ సేవలు, పర్యాటక, వ్యవసాయ సహకారం, ఇతర రంగాలకు సంబంధించిన సేవలు ఉచితంగా అందించేందుకు వీలు పడుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లోని4,740 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని, అందులో ఖమ్మం జిల్లా ఉందన్నారు.

జీపీఎస్​ ఉన్న ఈ వాహనం ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాజేశ్వరి, ప్రాజెక్టు జిల్లా కో ఆర్డినేటర్ షేక్ ఫయాజ్, ఈడీఎం దుర్గా ప్రసాద్ తదితరులు తెలిపారు.