నవంబర్ 2న హనుమకొండ కలెక్టరేట్ కు బీసీ కమిషన్ రాక : కలెక్టర్ పి.ప్రావీణ్య

  • స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ

హనుమకొండ, వెలుగు: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నవంబర్ 2న హనుమకొండ కలెక్టరేట్ కు బీసీ కమిషన్ బృందం రానుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు  అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి హనుమకొండ జిల్లాకు వస్తారన్నారు. 

ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు హాజరవుతారని, హనుమకొండ కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై 2న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజాప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల ప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, అనంతరం సాయంత్రం 4.30 గంటలకు కమిషన్​ బృందం మీడియాతో మాట్లాడతారని వివరించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ జి.రామ్ రెడ్డి, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.

రైస్ మిల్లర్లు సహకరించాలి..

జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియకు రైస్ మిల్లర్లు సహకరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. కలెక్టరేట్ లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్​, డీఆర్డీఏ, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జీవో 27 ప్రకారం 10 శాతం బ్యాంకు గ్యారంటీ, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ ను  సమర్పించిన మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తామని తెలిపారు. 

బ్యాంక్​ గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్లకు వారం రోజుల వరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఒక్కో రైస్​  మిల్లుకు ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారిని నియమిస్తామని, రైస్ మిల్లర్లు సహకరించి కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.