అక్టోబర్ 15లోపు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 15లోపు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పొడవు పింజ పత్తికి రూ.7521, మధ్యస్థ  పింజ పత్తికి రూ.7121లు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 

కొనుగోలుదారులు మద్దతు ధర కన్నా  తక్కువకు పత్తి కొనుగోలు చేయొద్దన్నారు. వచ్చే ఏడాది నర్సరీల ద్వారా కోటి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి కనిపించాలన్నారు. పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మండల ప్రత్యేక అధికారులు  దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.