వయోవృద్ధుల హెల్త్​కేర్​కు ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగం : కలెక్టర్​ముజామ్మిల్​ఖాన్​

  • సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన ఉండాలి
  • ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

ఖమ్మం టౌన్, వెలుగు : వయోవృద్ధుల హెల్త్​ కేర్​కు ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం స్థానిక టీటీడీసీ మీటింగ్ హాల్ లో జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత తమ ఇంట్లో ఉన్న వృద్ధులతో, పెద్దవాళ్లతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ, వారి అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం సమాజం కొంత నిలబడిందంటే దానికి కారణం నేటి వృద్ధులేనని తెలిపారు. నేడు దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకోవడంలో భాగస్వామ్యం వహించిన వయో వృద్ధులను గౌరవించుకోవడం అందరి బాధ్యత అన్నారు. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలలో వారానికి ఒక రోజు ‘రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్ డే’ను  నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వయో వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక డాక్టర్లు, వార్డు కన్సల్టేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దీనిని రెండు వారాల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టరేట్ లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా అటెండర్, వీల్ చైర్ ఏర్పాటు చేయాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్, తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ సిటిజన్స్ చట్టం గురించి ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కే.రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టంపై పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు కలిసి అవగాహన కల్పిస్తారని తెలిపారు.

సీనియర్ సిటిజన్ కేసులు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. సంవత్సరం లోపు కనీసం 50 మంది వృద్ధులకు ఉపయోగంగా, ఆహ్లాదంగా ఉండే విధంగా ఓల్డెజ్ హోం నిర్మిస్తామని తెలిపారు. అంతకుముందు జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను, వృద్ధులకు చట్టాలపై సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు వివరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ 10 మందిని జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే. రాంగోపాల్ రెడ్డి, జిల్లా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వి. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి జనార్దన్, వయోవృద్ధులు, ఆశ్రమాల నిర్వహకులు తదితరులు 
పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలతో కలిసి కలెక్టర్  కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఆడపిల్లలు విద్యకు దూరంగా ఉండేవారని, నేటి సమాజంలో మహిళలు పీజీ, డాక్టరేట్ లాంటి ఉన్నత స్థాయి చదువులు చదువుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. నేటి బాలికలు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.