రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి : కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలోని రైతుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయిల్ పామ్ సాగు, రైతు బీమా, ఎరువుల లభ్యత, క్రాప్ బుకింగ్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రైతు బీమా కింద 420 దరఖాస్తులు వచ్చాయని,  వ్యవసాయ శాఖ ద్వారా 347 దరఖాస్తులు ఎల్​ఐసీకి పంపగా, 311 రైతు కుటుంబాలకు క్లెయిమ్ సొమ్ము అందిందని తెలిపారు. మిగతా రైతు బీమా దరఖాస్తులు సమర్పించకపోవడానికి కారణాలు తెలుసుకుని, వ్యవసాయ అధికారులు సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ డెత్ సర్టిఫికెట్లు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలన్నారు. 

వ్యవసాయ విస్తరణ అధికారులు పనితీరు మెరుగుపడేలా మండల వ్యవసాయ అధికారులు సహకరించాలని సూచించారు. క్రాప్ బుకింగ్ సర్వే పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి మళ్లీ సమావేశం నాటికి క్లస్టర్ పరిధిలో కొత్తగా 25 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా చూడాలన్నారు. సన్న రకం వడ్లకు బోనస్ అందించడంలో సక్సెస్​ అయినందుకు అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎంవీ మధుసూదన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. 

చదువు కోసం చేసే సేవ శాశ్వతం

సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ సేవలు అందించే వారే శాశ్వతంగా నిలిచిపోతారని కలెక్టర్ అన్నారు. సహారా మినిస్టరీ, తానా పౌండేషన్ సహకారంతో డిస్ట్రిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.4లక్షల విలువ చేసే 8 ల్యాప్‌టాప్‌లు, 4 సైకిల్స్, దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్స్ ను  కలెక్టర్ సమక్షంలో పంపిణీ చేశారు. రఘునాథపాలెం కేజీబీవీ విద్యార్థులకు రూ.20వేల విలువైన సైన్స్ ల్యాబ్ పరికరాలను కలెక్టర్ అందజేశారు. విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలకు కలెక్టర్​ కృతజ్ఞతలు తెలిపారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన 

ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలోని మల్లెమడుగులో మూడు బ్లాక్ ల్లో నిర్మిస్తున్న 84 డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. చిన్న, చిన్న పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతి లోపు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు.