ఇంటింటి సర్వే షరూ.. పరిశీలించిన కలెక్టర్లు

భద్రాద్రికొత్తగూడెం /ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్​, వెలుగు : ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజలు తమ వివరాలు అందించి సహకరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్​ ఖాన్ కోరారు. సర్వే వల్ల పథకాలు రద్దవుతాయనే అపోహలు వద్దన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఈనెల 6 నుంచి 8 వరకు హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించాలన్నారు.

పక్కాగా సర్వే చేయాలని, ఏ రోజు ఎక్కడ సర్వే చేపట్టేది ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికల రూపకల్పన కోసమే ఈ సర్వే చేపడుతున్నామని, ప్రజలు ఎటువంటి అనుమానం లేకుండా వివరాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం తమకు నష్టపరిహారం అందలేదని వరద బాధితులు కలెక్టర్​ దృష్టికి తేగా దరఖాస్తు సమర్పిస్తే విచారించి అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ ద్వారకానగర్ లో సర్వేను కలెక్టర్​ పరిశీలించారు. జిల్లాలో ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ చొప్పున మొత్తం 3,300 పైగా ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

 కేఎంసీ పరిధిలో...

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే వివరాలను కేఎంసీ కార్యాలయంలోని మీటింగ్ హాల్ లో కేఎంసీ ఇన్​చార్జ్ కమిషనర్, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ మీడియాకు వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 152 ఎన్యుమరేటర్ బ్లాకులు ఉండగా, అవి ఇప్పుడు 965 కి పెరిగినట్లు తెలిపారు. ప్రతీ ఎన్యుమరేటర్ బ్లాక్ కు ఒక్కో ఎన్యుమేటర్ చొప్పున 965 మందిని నియమించినట్లు తెలిపారు. ఎక్కువగా అంగన్​వాడీ టీచర్లు, ఆశా, ఆర్పీలు సర్వేలో పాల్గొంటారని చెప్పారు.

60 డివిజన్లకు గాను ప్రతీ డివిజన్ కు రెండు బృందాలు ఉంటాయని తెలిపారు. సర్వే చేసే సిబ్బందికి డివిజన్ కు సంబంధించిన ఆయా బిల్ కలెక్టర్, జవాన్లు  సూపర్​వైజర్లు గా ఉంటూ కార్పొరేటర్ల సహకారంతో ఇంటింటికీ సర్వే స్టిక్కరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. సర్వే ఫస్ట్ ఫేజ్ లో హౌజ్​ లిస్టింగ్, సెకండ్ ఫేస్ లో 70 కి పైగా ప్రశ్నలతో కూడిన కుటుంబాల వివరాలను దరఖాస్తులను నింపే ప్రక్రియ ఉంటుందన్నారు. సర్వే ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ గా 1077 ను కేటాయించినట్లు తెలిపారు. 

కొత్తగూడెంలో...

కొత్తగూడెం మున్సిపాల్టీలోని 15వ వార్డులో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్​ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు. సర్వే చేసిన ఇంటికి కలెక్టర్​ స్టిక్కర్​ అంటించారు. సర్వే చేయాల్సిన విధానం గురించి ఎన్యుమరేటర్​కు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,761 ఎన్యుమరేషన్​ బ్లాకులు ఉండగా అన్నింటికీ ఎన్యుమరేటర్లను నియమించామన్నారు.

మూడు రోజులు ఇంటి గుర్తింపు కార్యక్రమం చేపడతామని, గుర్తింపు చేసిన గృహాలకు స్టిక్కర్లు అంటిస్తామని వివరించారు.  ప్రతీ ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి ఇంట్లో ఎంత మంది ఉంటారు, వారి ఆదాయ వివరాలు, ఎవరైనా విదేశాల్లో ఉన్నారా? వారి ఫోన్​ నంబర్, ఆధార్​ కా వివరాలు, తదితర సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. 

జూలూరుపాడు : మండలంలోని అన్ని గ్రామాలలో సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జూలూరుపాడు తహసీల్దార్​ స్వాతి బిందు సిబ్బందికి సూచించారు. బుధవారం 73 ఎన్యుమరేటర్లు గృహాలకు స్టిక్కరింగ్ చేశారని, ఏడుగురు పరిశీలకులు పాల్గొన్నారని తెలిపారు. 

చండ్రుగొండ : సర్వే బృందంతో కలిసి ఇంటింటి స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించారు. సర్వేలో తప్పులు దొర్లకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.