చెన్నూర్​లో చెరువుల సర్వే : కలెక్టర్​ కుమార్ ​దీపక్

  • రెవెన్యూ, ఇరిగేషన్​జాయింట్​సర్వేతో కబ్జాదారుల్లో గుబులు
  • కలెక్టర్​ కుమార్ ​దీపక్ ​ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • ఎఫ్ టీఎల్, బఫర్​ జోన్ ​హద్దులు ఏర్పాటు చేయనున్న అధికారులు

చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో చెరువుల కబ్జా కారణంగా చుట్టుపక్కల కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్​కుమార్​ దీపక్ ​చెరువుల సర్వేకు ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు సోమవారం నుంచి జాయింట్​ సర్వే ప్రారంభించారు. ముందుగా చెన్నూర్​ టౌన్​లోని కుమ్మరికుంట చెరువును సర్వే చేస్తున్నారు. కుమ్మరికుంట విస్తీర్ణం 16.24 ఎకరాలు కాగా, సుమారు 8 ఎకరాలు కబ్జా అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి అస్నాద్​ఎక్స్​ రోడ్డు వరకు చెరువు ఎఫ్​టీఎల్​నుంచే రోడ్డు నిర్మించారు. ఇదే అదునుగా రోడ్డు వైపు ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్​లో బిల్డింగులు వెలిశాయి. దీంతో అధికారులు 17 మందికి నోటీసులు జారీ చేసి చెరువును సర్వే చేస్తున్నారు. ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​ హద్దులు నిర్ణయించి ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

సంచలనంగా మారిన శనిగకుంట పేల్చివేత

చెన్నూర్​ శివారులోని శనగకుంట చెరువు 33.22 ఎకరాల్లో విస్తరించి ఉండగా, దీనికింద సుమారు 70 ఎకరాల ఆయకట్టు సాగువుతోంది. వర్షాకాలంలో చెన్నూర్​ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు ముంపునకు గురవుతోందని ఇటీవల చెరువు మత్తడిని కొంతమంది జిలెటిన్​ స్టిక్స్​ పెట్టి పేల్చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో వార్డు కౌన్సిలర్ భర్త, బీఆర్ఎస్​ లీడర్​ పెండ్యాల లక్ష్మీనారాయణతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు. ఈ నేపథ్యంలో శనగకుంట చెరువును సర్వే చేసి ఎఫ్​టీఎల్, బఫర్ ​జోన్ ​హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో త్వరలోనే శనగకుంట చెరువును సైతం సర్వే చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే చెన్నూర్​ పెద్ద చెరువు 25 ఎకరాలకు పైగా ఉండగా, ఇందులోనూ కొంత భూమి గతంలోనే కబ్జా అయినట్టు అనుమానిస్తున్నారు. చెరువుల కబ్జాపై గవర్నమెంట్​ సీరియస్​గా ఉండడం, కలెక్టర్​ ఆదేశాలతో రెవెన్యూ, ఇరిగేషన్​ అధికారులు జాయింట్​ సర్వే స్టార్ట్​ చేయడంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది.