కలెక్టరేట్​ ప్రక్షాళనపై ఫోకస్...​ డైరెక్ట్​గా కంప్లయింట్స్​ తీసుకుంటున్న కలెక్టర్​

  •        అధికారుల క్రమశిక్షణపై కలెక్టర్​   దృష్టి
  •     రెండు రోజుల్లో ముగ్గురు ఆఫీసర్ల సస్పెన్షన్​
  •     డిపార్టుమెంట్లను సెట్​ చేసే పనిలో ఆఫీసర్లు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన కలెక్టర్​ కోయ శ్రీహర్ష కలెక్టరేట్​లో అధికారుల పనితీరుపై, శాఖల ప్రక్షాలపై ఫోకస్​ చేశారు.రెండు రోజుల వ్యవధిలోనే నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు అధికారులను  సస్పెండ్​ చేశారు. బాధితుల నుంచి నేరుగా కంప్లయింట్స్​ తీసుకుంటూ ఆయా శాఖల అధికారుల పనితీరుపై ఎంక్వైరీ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన నుంచి చాలా మంది అధికారులు ట్రాన్స్​ఫర్​ అయినా ఇక్కడ నుంచి వెళ్లలేదు.  

గతంలో ధరణిసమస్యల పరిష్కారంలో చాలా మంది రెవెన్యూ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాంటి వారు చాలా మంది ఇప్పుడు కలెక్టరేట్​లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.  గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి స్థానికులైన పలువురు అధికారులు ఇక్కడికి  ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. అలాంటి వారి వివరాలు కూడా కలెక్టర్​ ఆరాతీసినట్లు సమాచారం. దీంతో ఆయా విభాగాల్లో అధికారులు అలర్ట్​ అవుతున్నారు. అధికారులంతా తమ డిపార్టుమెంట్లను సెట్ చేసుకునే పనిలో పడ్డారు. 

రెండు రోజుల్లో ముగ్గురు...

పెద్దపల్లి కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న శ్రీహర్ష అన్ని శాఖల అధికారుల పనితీరును నేరుగా సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఆర్​అండ్​బీ అధికారితో పాటు జిల్లా భూగర్భ జల అధికారి, జిల్లా ఆడిట్ అధికారిని సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో  సస్పెండ్ చేశారు.  కలెక్టరేట్​లోని పలు విభాగాల్లో బయోమెట్రిక్​ ఉపయోగించకుండా, మ్యాన్యువల్​ అటెండెన్స్​ ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారి కోసం ఎవరైనా వచ్చి అడిగితే, కిందిస్థాయి ఉద్యోగులు ‘సార్​ సైట్​ మీదకు పోయారు’ అని చెప్తున్నారు. ఇలా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి.  

డిప్యూటేషన్ల పేరుతో తిష్ట...

జిల్లాలోని వివిధ ఆఫీసుల్లో ఉద్యోగులు, ఉన్నతాధికారులు డిప్యూటేషన్ల పేరుతో ఇక్కడే తిష్ట వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి చాలా మంది అధికారులు వివిధ డిపార్టుమెంట్లలో ఇక్కడే ఉండి పోయారు. వైద్యశాఖలో ఓ అధికారి పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. ఆయనకు ఎందుకు ట్రాన్స్​ఫర్​ కావడం లేదో ఎవరికీ తెలియదు. 

ఆ అధికారికి గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రాజకీయ పలుకుబడి ఉండటంతోనే అతన్ని ఎవరూ కదిలించటం లేదన్న ప్రచారం జరుగుతోంది.  అలాగే పెద్దపల్లి మున్సపాలిటీలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న ఓ అధికారికి ఇప్పటికే రెండు, మూడు సార్లు ట్రాన్స్​ఫర్​ అయింది. తనకు బదులు ఇక్కడికి బదిలీపై వచ్చిన వారిని ఇతర ప్రాంతాలకు పంపుతూ డిప్యూటేషన్​ పేరిట తాను మాత్రం ఇక్కడ నుంచి కదలడం లేదు.   పెద్దపల్లి మున్సిపాలిటీలో ఆ ఉద్యోగికి రియల్టర్లతో మంచి దోస్తీ ఉండటంతో పాటు రాజకీయ పలుకుబడి కూడా ఉంది.