గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్​ జితేశ్​వి పాటిల్

  • సర్కారు దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​
  • జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్ హాస్పిటల్​కు వచ్చే పేషెంట్లలో ఎక్కువ మంది పేదలే ఉంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​(జీజీహెచ్)ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మురుగునీరు హాస్పిటల్​ఆవరణలో నిల్వ ఉండడం, మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడాన్ని చూసి  డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు.

 దీనిపై వెంటనే ఆర్​ అండ్​ బీ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. హాస్పిటల్​లో వార్డుల్లోకి వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. హాస్పిటల్​లో కరెంట్​వైరింగ్​సక్రమంగా లేదని, ఎర్తింగ్​ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు ఆయన దృష్టికి తీసుకొవచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్​ చెప్పారు. వైరల్​ఫీవర్స్​ ప్రబలుతున్నందున హాస్పిటల్​లో అందుబాటులో ఉన్న మెడిసిన్స్​గురించి ఆరా తీశారు. మెడిసిన్స్​ రావడం లేదని, బయటి నుంచి కొనుగోలు చేసేందుకు హాస్పిటల్​లో ఫండ్స్​ లేవని, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని కలెక్టర్​ కు డాక్టర్లు చెప్పారు. 

దీనికి కలెక్టర్​ స్పందిస్తూ విష జ్వరాలు విజృంభించకుండా అర్జెంట్​గా అవసరమైన మందులు ఏం కావాలి, హాస్పిటల్​లో ఇంకా కావాల్సిన మెడిసిన్, సౌకర్యాలపై తనకు నివేదిక అందజేయాలని ఆర్ఎంవో డాక్టర్​ రమేశ్​కు సూచించారు. డాక్టర్ల డ్యూటీ వివరాలు కూడా తనకు ఇవ్వాలని చెప్పారు. పేదలు వచ్చే సర్కారు దవాఖానాలపై నమ్మకం పెరిగేలా డాక్టర్లు, సిబ్బంది వైద్యం అందించాలని కలెక్టర్​ సూచించారు.