పద్ధతి, ప్రణాళికల్లేని పనులు ఎందుకు?

  • ట్రైబల్ మ్యూజియం పనులపై కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అసంతృప్తి

భద్రాచలం, వెలుగు :  ‘ప్చ్.. ఐయామ్ నాట్​ సాటిస్ఫైడ్​.. పద్ధతి, ప్రణాళికల్లేకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? నేను నిధులిచ్చి కోఆపరేట్ ​చేస్తున్నా మీరు చేసేది ఇదేనా..’ అంటూ భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ వి పాటిల్​అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్​ మ్యూజియంలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన పల్లె నిర్మాణంలో భాగంగా మ్యూజియం ఎదురుగా కట్టిన అస్సాం రాష్ట్ర గుడిసెను చూసి మండిపడ్డారు.

ఆ గుడిసె ఇక్కడి వర్షాలకు ఎందుకూ పనికిరాకుండా పాడై పోతుందని, ఈ పనుల వల్ల టూరిస్టుల ముందు పలుచన అవుతామని అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను టూరిస్టులకు పరిచయం చేయడంలక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించినా.. ఇలాంటి పిచ్చి పనులు చేస్తారేంటి అని మండిపడ్డారు. మ్యూజియం ప్రాంగణంలో ఓపెన్​ జిమ్​, బాక్స్ క్రికెట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ ఆఫీసర్లు చెప్పగానే ఇది ఆదివాసీల కల్చరా? అని నిలదీశారు. వెంటనే ఆ పనులు ఆపాలని ఆదేశించారు.

‘మనం అనుకున్నాం..  ప్లాన్​ చేసుకున్నాం.. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారు చేశారు. మనకంటే వెనుక అనుకున్న ములుగు జిల్లా ఆఫీసర్లు చక్కగా సోలార్​ లైట్లు ఏర్పాటు చేసి ఫైర్​ క్యాంపులు, టెంట్లు నిర్మించి టూరిజం స్పాట్​ను ఓపెన్​ చేశారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ముక్కోటి ఏర్పాట్లు పరిశీలించేందుకు గోదావరి తీరానికి వెళ్తున్న  క్రమంలో కరకట్ట కింద నది పక్కనే సంచార జీవులు తాత్కాలికంగా నిర్మించుకున్న టెంట్లను కలెక్టర్​ గమనించారు.

‘ఇలాంటి ఐడియాలు ప్రజలకు వచ్చినప్పుడు మన ఆఫీసర్లకు ఎందుకు రావట్లేదు. వెంటనే ఈ ప్రాంతాన్ని చదును చేసి, చుట్టూ కంచెలు కట్టి, టెంట్లు వేసి టూరిస్టులకు అనువుగా తయారు చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. ఫైర్​ క్యాంపు పెడితే ఊళ్లో లాడ్జీలు, ఇతర రూమ్​ల కోసం టూరిస్టులు వెళ్లే పరిస్థితి ఉండదని చెప్పారు. 

సంప్రదాయాలను అనుసరించాలి

ట్రైబల్​ మ్యూజియం వద్ద టూరిజం పనుల్లో సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించాలని కలెక్టర్​ ఆదేశించారు. ఖాళీగా ఉన్న భవనాల్లో ఆదివాసీలు, నాయకపోడులు వెదురు క్రాఫ్ట్ వస్తువులు అమ్ముకునేలా తయారు చేయాలన్నారు. మ్యూజియం వద్ద పాతకాలపు ఇళ్లలో టూరిస్టులు సేదతీరి, ఆదివాసీల వంటకాలు తినేలా సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతీ స్టాల్​లో ట్రైబల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండాలని ఆదేశించారు. తృణధాన్యాలు, ఔషధ గుణాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో దామోదర్, ఐటీడీఏ ఏవో సున్నం రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, మ్యూజియం ఇన్​చార్జ్ వీరస్వామి తదితరులు ఉన్నారు.

‘ముక్కోటి’ ఏర్పాట్ల పరిశీలన

సీతారామచంద్రస్వామి ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనం, తెప్పోత్సవం వీక్షించడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్​ జితేశ్​ తెలిపారు. మంగళవారం ముక్కోటి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈవో రమాదేవి, ఆర్డీవో దామోదర్, ట్రాఫిక్​ ఎస్సై మధుప్రసాద్​, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రావుతో చర్చించారు. ప్రముఖులకు, వీవీఐపీలు, వీఐపీలు అందరికీ ద్వారదర్శనం కనబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

సూచిక బోర్డులు పెట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్​ ప్లేస్​లు పెంచాలని చెప్పారు. వాటర్, పబ్లిక్​ టాయిలెట్లు, శానిటేషన్​ విషయంలో రాజీపడొద్దని ఈవో శ్రీనివాసరావుకు సూచించారు.