కామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి : జితేశ్ వి. పాటిల్

సదాశివనగర్​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో  మరో ఐదు రోజుల్లో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ అన్నారు.  ఆదివారం అడ్లూర్​ ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని రామారెడ్డి మండలంలోని గిద్ద, పోసానిపేట్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. 

 జిల్లాలో ఇప్పటి వరకు 350  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా  46,613 మంది రైతుల నుంచి 576  కోట్ల విలువ గల 2.61 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో  ఇప్పటి వరకు రూ. 504  కోట్లు జమ చేశామన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు 200 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు.  మరో రెండు రోజుల్లో 30 కేంద్రాల్లో  ధాన్యంను పూర్తిగా కొనుగోలు  చేస్తామన్నారు.  

ఈ నెల చివరి వరకు లక్ష్యం పూర్తి చేస్తామన్నారు.  రైతులు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు. ధాన్యం దించుకోవడం లేదనే వార్తల్లో నిజం లేదన్నాడు.  వానలకు ధాన్యం తడిస్తే రైతుల నుంచి ధాన్యం సేకరించి బాయిల్డ్​ రౌస్​ మిల్లులకు తరలిస్తామన్నారు. ఆకాల వర్షాల పట్ల రైతుల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆఫీసర్​ మల్లికార్జున్​ బాబు, అడ్లూర్​ ఎల్లారెడ్డి సొసైటీ సెక్రటరి కడేం భైరయ్య,  తహసీల్దార్​ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.