ఖమ్మం జిల్లాలో టూరిజంను డెవలప్​ చేద్దాం : కలెక్టర్ ​జితేశ్​ వి పాటిల్​

భద్రాచలం, వెలుగు :  జిల్లాలో టూరిజంను డెవలప్​ చేద్దామని కలెక్టర్ ​జితేశ్ వి పాటిల్ అధికారులకు పిలుపునిచ్చారు. భద్రాచలం కరకట్ట కింద గోదావరి తీరాన నిర్మిస్తున్న రివర్​ సైడ్​ క్యాంపెయినింగ్, గిరిజన కల్చర్​ స్టాల్స్, హట్స్ నిర్మాణాల పనులను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వతో కలిసి టూరిజం డెవలప్మెంట్ పనులను పరిశీలించారు. భద్రాచలం వచ్చే యాత్రీకులను గిరిపల్లెలకు తీసుకెళ్లి ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలు, అడవి అందాలు, వాగులు, చెరువుల సొగసులు పరిచయం చేసేలా జరుగుతున్న యాక్షన్​ ప్లాన్​ సక్సెస్​ చేయాలని కలెక్టర్​ సూచించారు. 

.ప్రపంచానికి భద్రాచలం పేరు మారుమోగేలా కృషి జరుగుతుందని తెలిపారు. వచ్చే నెల 9,10 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం కార్యక్రమాలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నందున జిల్లా సంస్కృతిక వైభవాన్ని , టూరిజం స్పాట్లను వారు దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి కరకట్ట ప్రదేశంలో రివర్​ ఫెస్టివల్ తరహాలో భక్తులకు కనువిందు చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 

ఆదివాసీలు వంటలు, కల్చర్, నృత్యాలు, అటవీ ఉత్పత్తులు, వారి వేషధారణలో టూరిస్టులు ఫొటోలు దిగేలా స్పాట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జనవరి 8 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. రివర్​ ఫెస్టివల్​ వచ్చే మార్చి నెల వరకు, తర్వాత నవంబరు నుంచి 2026 మార్చి వరకు ప్రణాళికాబద్ధంగా రూపొందించినట్లు తెలిపారు. వచ్చే నెల 5 నుంచి బొజ్జిగుప్ప టూరిస్టు ప్రాంతంపై కరపత్రాల ద్వారా ప్రచారం ప్రారంభించాలని ఆదేశించారు. ఇరిగేషన్​, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో కార్యక్రమం సక్సెస్​చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దామోదర్, మత్స్యశాఖ ఏడీ ఇంతియాస్​ అహ్మద్, ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్, డీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.