అభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజాపాలన కళాయాత్ర ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఈనెల 23న నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల బృందం ఆధ్వర్యంలో జయజయహే ప్రజా పాలన పేరున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 4న జిల్లా కేంద్రంలో అంతదూపుల నాగరాజు ఆధ్వర్యంలో జానపద డాన్స్, డ్రామా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

 ఇసుక సరఫరా చేయాలి.. 

సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుకను సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. శాలిగౌరారం మండలం, వంగమర్తి ఇసుక రీచ్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుకను ఇచ్చేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపింది.