ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

  • కలెక్టర్లు హనుమంతు జెండగే, 
  • తేజస్ నందలాల్ పవార్, నారాయణరెడ్డి

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజా సమస్యలపై అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే, సూర్యాపేట కలెక్టర్​ తేజస్ నందలాల్ పవార్, నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. యాదాద్రి జిల్లాలో 39, సూర్యాపేట జిల్లాలో 59 ఫిర్యాదులు రాగా వీటిలో ఎక్కువగా భూములకు సంబంధించినవే ఉన్నాయి.

 ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్లు వాటిని పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో యాదాద్రి అడిషనల్ కలెక్టర్లు బెన్​ షాలోమ్​, గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్​డీవో నాగిరెడ్డి, ఏవో జగన్మోహన్ ప్రసాద్, సూపరింటెండెంట్ రవికుమార్, సూర్యాపేట డీఆర్​డీవో అప్పారావు, ఇన్​చార్జి డీపీవో నారాయణరెడ్డి, డీఏవో శ్రీధర్ రెడ్డి ఉన్నారు. 

ఉద్యోగులకు బయోమెట్రిక్..

ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జిల్లా అధికారులు అందరూ తమ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకునే విధంగా చూడాలని, ఒకవేళ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయకపోతే సంబంధిత శాఖ జిల్లా అధికారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

నకిలీ పాస్ బుక్ లు తయారీపై చర్యలు తీసుకోవాలి..

నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్ కు తరలివచ్చారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అడిషనల్​ కలెక్టర్ పూర్ణచంద్ర ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. నకిలీ పాస్ బుక్ లు తయారు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో పెద్దవూర మండలం సంగారం గ్రామానికి చెందిన ఊరే రామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. జిల్లాలో డీజే సౌండ్ వినియోగంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ డీజే యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. డీజే సౌండ్ నిషేధంతో జిల్లావ్యాప్తంగా 800 కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.