సన్న వడ్లకు ప్రత్యేక సెంటర్లు : ​కలెక్టర్లు హనుమంతు

  • కలెక్టర్లు​ హనుమంతు జెండగే, సి.నారాయణరెడ్డి 

యాదాద్రి, నల్గొండ అర్బన్, వెలుగు : సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్లు​హనుమంతు జెండగే, సి.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం యాదాద్రి కలెక్టరేట్ లో నిర్వహించిన వడ్ల కొనుగోలు సన్నాహక సమావేశంలో కలెక్టర్​హనుమంతు మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 369 సెంటర్లలో దొడ్డు రకం వడ్లకు 322, సన్న వడ్లకు 47 కేటాయించినట్టు చెప్పారు. వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

రైతులకు నష్టం జరిగే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని సెంటర్లలో వేయింగ్ మిషన్, ఆన్​లైన్​లో వివరాలు నమోదు కోసం ట్యాబ్ లు సమకూర్చుకోవాలన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్​కు రూ.500 బోనస్ చెల్లిస్తున్నందున తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. 

రైతులు ప్రైవేట్ మిల్లర్లకు ధాన్యాన్ని అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మరోవైపు తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ కలెక్టర్​సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు బెన్ షాలోమ్, జె.శ్రీనివాస్, అధికారులు​పాల్గొన్నారు.