యాదాద్రి జిల్లాలో గంజా హాట్ స్పాట్లు 30 .. అరికట్టడానికి స్పెషల్ టీమ్స్

  • స్కూల్స్, కాలేజీల సమీపంలో గంజాయి సేల్స్​
  • లేబర్ కాలనీల్లో సైతం చిన్న ప్యాకెట్లు, చాక్లెట్లుగా లభ్యం
  • తరచూ పట్టుబడుతున్న గంజా

యాదాద్రి, వెలుగు : యువత, విద్యార్థులే లక్ష్యంగా మత్తు పదార్థాల బిజినెస్ సాగుతోంది. సిగరెట్​తో మొదలైన వ్యసనం.. చివరకు గంజాయి, హాష్ ఆయిల్ పీల్చేస్తూ మత్తుకు బానిస అవుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్​కు సమీపంలో ఉన్న యాదాద్రి జిల్లాలో గంజాయి సేల్స్​కు సంబంధించి హాట్ స్పాట్లు పెరిగిపోతున్నాయి. దీంతో ఇటీవల కలెక్టర్ హనుమంతరావు నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో గంజాయి రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి జిల్లా హైదరాబాద్​కు దగ్గరగా ఉండడంతో గంజాయి విక్రయాలు పెరిగిపోతున్నాయి. 

జిల్లాలోని భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ లోని ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు వృత్తి విద్యా కాలేజీల్లో స్థానిక విద్యార్థులతోపాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. గంజాయి సేల్స్​ చేసేవారు కాలేజీ స్టూడెంట్స్​ను ఎంచుకొని విక్రయిస్తున్నారు. గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నారు. దీన్ని వాడడంతోపాటు మత్తుకు బానిసలుగా మారి వారి అవసరాల కోసం గంజాయినే సేల్స్​ చేసే స్థాయికి చేరుకుంటున్నారు.  

స్కూల్స్.. కాలేజీల సమీపంలో అడ్డాలు..

పోలీసులకు చిక్కకుండా గంజాయి సేల్స్​చేసేవాళ్లు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో స్కూల్స్, లేబర్ ఏరియాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకొని గంజాయి సేల్స్​చేస్తున్నారు. గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కాకుండా సోంపు ప్యాకెట్ల సైజుల్లోని ప్యాకెట్లలో చేర్చి అమ్మకాలు చేస్తున్నారు. పైగా గంజాయి చాక్లెట్లు తెప్పించి సేల్స్ చేస్తున్నారు. సేల్స్​ సెంటర్లు కూడా స్కూల్స్ సమీపంలో, లేబర్ కాలనీల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

యాదాద్రిలో 30 హాట్ స్పాట్లు..

యాదాద్రి జిల్లాలో 30 గంజాయి హాట్ స్పాట్లను ఎక్సైజ్​శాఖ గుర్తించింది. వీటిల్లో ఎక్కువగా స్కూల్స్, కాలేజీల సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని భువనగిరి ఎక్సైజ్ పరిధిలో అత్యధికంగా 16 హాట్ స్పాట్లు ఉన్నాయని, ఇవి కూడా ప్రముఖ స్కూల్స్, కాలేజీల సమీపంలోనే ఉన్నాయి. ఆలేరు పరిధిలో ఐదు ఉండగా, ఆలేరు రైల్వే స్టేషన్, పొట్టిమర్రి, చాడ, ముత్తిరెడ్డిగూడెం సమీపంలో ఉన్నాయి. రామన్నపేట పరిధిలో 5 ఉండగా, చౌటుప్పల్​లో మూతపడిన కాలేజీ సమీపంలో గంజాయిని అమ్మతున్నట్లు గతంలోనే గుర్తించారు. మోత్కూరు పరిధిలో మరో 4 హాట్​స్పాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. 

అరికట్టడానికి స్పెషల్​ టీమ్స్..

గంజాయి అరికట్టడం కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. తహసీల్దార్, ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్​ నుంచి ఒక్కొక్కరు చొప్పున టీమ్​లో మెంబర్​గా ఉంటారు. వీరు ముగ్గురు కలిసి అనుమానం కలిగిన చోట్లతోపాటు పాన్​షాపులు సహా చిన్న చిన్న షాపులను చెక్ చేస్తారు. గంజాయితో తయారు చేసిన పదార్థాలు లభ్యమైతే వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయనున్నారు. 

యాదాద్రి మీదుగా గంజాయి రవాణా..

ప్రధానంగా గంజాయి ఆంధ్ర, ఒడిశా బార్డర్ (ఏవోబీ) నుంచి ట్రాన్స్​పోర్ట్ చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి యాదాద్రి జిల్లా మీదుగా హైదరాబాద్​కు రవాణా సాగుతోంది. పంతంగి, గూడూరు టోల్​ప్లాజా మీదుగా వెళ్లాల్సిందే. మరికొందరు ట్రైన్​రూట్​లో సరఫరా చేస్తున్నారు. దీంతో అనేకమార్లు గంజాయి, హాష్ ఆయిల్​తోపాటు గంజాయి చాకెట్లు కూడా పట్టుబడ్డాయి. 2020 నుంచి ఇప్పటివరకు 85 కేసులు నమోదు చేసి 48 మందిని పోలీసులు అరెస్ట్​చేశారు. 63 మందిపై పీడీ యాక్ట్​ ప్రయోగించారు. 4,370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ గంజాయి సేల్స్ చేస్తున్న పది మందిపై కేసులు నమోదు చేసింది. 9 వెహికల్స్​ను సీజ్ చేసింది. వారివద్ద నుంచి రెండు లీటర్ల హాష్ ఆయిల్​, 8.411 కిలోల గంజాయితో పాటు 4,557 చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

గంజాయి అరికట్టడానికి చర్యలు..

గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో గుర్తించిన గంజాయి హాట్​స్పాట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. సేల్స్​ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

సైదులు, ఎక్సైజ్​ఎస్పీ, యాదాద్రి