సివిల్స్​ ప్రొబేషనరీ ఆఫీసర్ల టూర్​ : కలెక్టర్ నారాయణరెడ్డి

కలెక్టర్ నారాయణరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమ పథకాల అధ్యయనం కోసం ఈనెల 21 నుంచి 28 వరకు సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొబేషనరీ అధికారుల బృందం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. 

జిల్లాలోని పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం, చింతపల్లి మండలం జర్పులతండా, దేవరకొండ మండలం కర్నాటిపల్లి, కొండమల్లేపల్లి మండలం ఇస్లావత్ తాండ, పెండ్లిపాకల గ్రామాల్లో అధికారుల బృందం పర్యటించనున్నట్లు వివరించారు. ఈ బృందంలో 21 మంది అధికారులు ఉంటారని, గ్రామానికి ఐదుగురు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. అధికారులు పర్యటించే ఆయా గ్రామాల ప్రొఫైల్ తోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తయారు చేయాలన్నారు.

ప్రొబేషనరీ అధికారులు 21 నుంచి 24 వరకు వారికి కేటాయించిన గ్రామాల్లోనే రాత్రి బసచేస్తారని తెలిపారు. 25న మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో అధ్యయనం చేస్తారని పేర్కొన్నారు. 26 ,27 తేదీల్లో దేవరకొండ, నాగార్జునసాగర్ మున్సిపాలిటీల్లో పర్యటిస్తారని చెప్పారు. 28న జిల్లా కేంద్రానికి వచ్చి తనతో సమావేశం అవుతారని తెలిపారు. టెలీకాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.