రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : కలెక్టర్ సి.నారాయణరెడ్డి  

 

నల్గొండ అర్బన్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు రవాణాశాఖ అధికారులు పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించగలిగితే మనుషుల ప్రాణాలు రక్షించడమే కాకుండా, కుటుంబాలను నిలబెట్టిన వారమవుతామని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇతర రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు. పోలీసు, ఇంజినీరింగ్ అధికారుల సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వర్షాల వల్ల గుంతలు పడిన రహదారులకు వెంటనే మరమ్మతులు చేయించాలని తెలిపారు. 

జిల్లాలో ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి..

జిల్లాలో ప్రతిపాదించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 375 కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రతిపాదించామని తెలిపారు.

వాటన్నింటినీ బుధవారం సాయంత్రంలోపు ప్రారంభించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను తక్షణమే తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సమావేశాల్లో ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ పూర్ణచంద్ర,  ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, ఆర్టీవో లావణ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.