రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని..ట్యాబ్ లో ఎంట్రీ చేయాలి : కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్

తాడ్వాయి, వెలుగు : కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ లో ఎంట్రీ చేయాలని  కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్ అన్నారు. బుధవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం పరిశీలించి, నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సెంటర్ కు కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలన్నారు.  

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని  ట్యాబ్ లో ఎంట్రీ చేయాలని సూచించారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అనంతరం ఎర్రపహడ్ గ్రామంలో చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును  పరిశీలించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ను పకడ్బందీగా చేయాలన్నారు.  కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, ఎంపీడీవో సాజిద్​ఆలి, తహసీల్దార్​ రహీముద్దీన్, ఎంపీఓ సబితా రెడ్డి పాల్గొన్నారు 

గ్రూప్​3 పరీక్షకు ఏర్పాట్లు చేయాలి

కామారెడ్డిటౌన్, వెలుగు : ఈనెల 17,18 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ చైర్మన్​ ఎం.మహేందర్​రెడ్డి అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై బుధవారం  ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.  

అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే సెంటర్ల లోపలకు అనుమతించాలన్నారు.  సమీక్షలో కామారెడ్డి జిల్లా  కలెక్టర్​ఆశిశ్​సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్​ కలెక్టర్లు శ్రీనివాస్​రెడ్డి, వి.విక్టర్ పాల్గొన్నారు.