కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లా ఆస్పత్రిలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నందున వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. జిల్లాలో వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో కలియ తిరిగారు. ఇన్ పేషంట్ గా అడ్మిట్ అయిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత ఉందని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు.
వైద్యుల కొరత లేకుండా నియామక ప్రక్రియ చేపట్టాలని, జిల్లాలోని ఏయే మండలాల నుండి ఎక్కువ జ్వరం కేసులు వస్తున్నాయని ఆరా తీసి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ని ఆదేశించారు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.