ధాన్యం కొనుగోళ్లపై ఫోకస్

  • జిల్లాలో 424 సెంటర్ల ఏర్పాటు
  • తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు 
  • మూడు రోజుల్లో నగదు జమ చేయాలని కలెక్టర్​ఆదేశం
  • రెండు రోజుల్లో 18 వేల మెట్రిక్​ టన్నుల​ ధాన్యం  కొనుగోలు

కామారెడ్డి, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేందుకు కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్ ​ప్రత్యేకంగా దృష్టిసారించారు.  వడ్లను దిగుమతి చేసుకోమన్న మిల్లర్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారు.  జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 18 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని తూకం వేశారు. వరి కోతలు ప్రారంభించిన రైతులు సెంటర్లలో  కొనుగోళ్లు జరగకపోవడంతో పడిగాపులు కాశారు.  సకాలంలో బియ్యం అప్పగింతపై ప్రభుత్వం బ్యాంక్​గ్యారంటీ అడిగింది. 

 దీంతో వడ్లు దింపుకునే విషయంలో  జాప్యం జరిగింది.   జిల్లాలో వానాకాలం  సీజన్లో   ఆరు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంచనా వేశారు.  దీంతో కొనుగోళ్లు చేపట్టేందుకు జిల్లాలో 424 సెంటర్లను  సొసైటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.  రైతులు ధాన్యాన్ని తెచ్చి సెంటర్ల వద్ద ఆరబోశారు.    మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి బదులుగా నిర్దేశించిన గడువులోగా  బియ్యాన్ని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించడం లేదు. 

 ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది.   కే టాయించిన వడ్లకు బదులుగా బియ్యం అప్పగింతకు సంబంధించి ప్రభుత్వం మిల్లర్లను బ్యాంక్​ గ్యారంటీ అడిగింది.  మొదట మిల్లర్లు వ్యతిరేకించినా తర్వాత  ఇచ్చేందుకు ముందుకొచ్చారు.  ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు అగ్రిమెంట్​ చేసుకోవడంతో కొనుగోళ్లు ఉపందుకున్నాయి.  జిల్లాలో  సోమవారం నుంచి తూకం వేస్తున్నారు.  రెండు రోజుల్లో 18 వేల మెట్రిక్​ టన్నుల ​ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. 

కలెక్టర్​ ఫోకస్​

జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా  కలెక్టర్​ చర్యలు చేపట్టారు. సెంటర్లను విజిట్​ చేసి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.  సెంటర్లలో మౌలిక వసతులపై ఆరా తీయటంతో పాటు  కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూస్తున్నారు. సంబంధిత  శాఖల ఆఫీసర్లతో పాటు, మిల్లర్లతో  రివ్యూ మీటింగ్​ ఏర్పాటు చేశారు.  

సెంటర్లలో సరిపడా కాంటలు,  హామాలీలు, గన్నీ బ్యాగ్స్​ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.  తూకం వేసిన వెంటనే సెంటర్​ నుంచి మిల్లుకు రవాణా చేసేందుకు అవసరమైన లారీలను సమకూర్చుకోవాలన్నారు.  మంగళవారం లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని కలెక్టర్​ పర్యటించి రైతులతో మాట్లాడారు.  తూకం వేసిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలన్నారు. 

అకాల వర్షాల భయం

సెంటర్లలో ధాన్యం ఆరబోసిన రైతులు తుఫాన్​ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆరిన వడ్లు తడిసిపోవడం, వరద నీటిలో కొట్టుకుపోతుండటంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల జిల్లాలో  లింగంపేట, సదాశివనగర్​, కామారెడ్డి, రామారెడ్డి తదితర మండలాల్లో  కురిసిన వర్షాలకు సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.