ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​

లింగంపేట, వెలుగు : జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని మెంగారం, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలంలోని తాండూర్​ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించి కాంటాలు వేయాలన్నారు.  

వెంటనే ధాన్యం బస్తాలను రైస్​మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులకు సంబంధించిన ధాన్యం సేకరణ, బ్యాంక్​ ఖాతా తదితర వివరాలను ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులకు రెండు మూడురోజుల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు. అనంతరం లింగంపేటలో నాగన్నమెట్లబావిని  సందర్శించారు. టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేయాలని, కాటేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. బావి లో ఉన్నచెత్తను తొలగించాలని, బావి సరిసరాలలో మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు.

నాగన్న బావిని తిలకించడానికి వచ్చిన చిన్నారులతో కలెక్టర్​ మాట్లాడి చరిత్ర తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఫౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్​ రాజేందర్, ఇన్​చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార​ అధికారి రాంమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ నరేశ్, లింగంపేట సింగిల్​విండో చైర్మన్​ దేవేందర్​రెడ్డి, తాండూర్​ సొసైటీ చైర్మన్​ఆకిడి గంగారెడ్డి, సీఈఓలు పెంటయ్య, జైపాల్​రెడ్డి తదితరులు ఉన్నారు.