ఇక మండలాల్లో ప్రజావాణి

  • మండల స్థాయి ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశాలు
  • ఫిర్యాదు స్వీకరించిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలి 
  • భూ సమస్యల అప్లికేషన్ల కు స్పెషల్ కౌంటర్

కామారెడ్డి, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సరికొత్త మార్పులు చేశారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి జిల్లా స్థాయి ఆఫీసర్లు కలెక్టరేట్ లో, మండల స్థాయి ఆఫీసర్లు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ లో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించనున్నారు. ఈ మార్పు వల్ల తమ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో కలెక్టరేట్ నుంచి బాధితులు  నమ్మకంతో వెనుదిరిగే అవకాశం ఉంది.  

ప్రతి ఫిర్యాదుపై ఫోకస్

 ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఎవరి అర్జీలు తిరస్కరిస్తారో అందుకు  కారణాలు ఫిర్యాదుదారుడికి కచ్చితంగా చెప్పాలని కలెక్టర్ ఆదేశించారు.  దీంతో పాటు మండల స్థాయిలో కూడా ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.  కామారెడ్డి కలెక్టరేట్‌‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రతి వారం70 నుంచి 80 ఫిర్యాదుల వరకు వస్తున్నాయి.

ఎక్కువగా భూసమస్యలు, సరిహద్దు కొలతలు, పాస్ బుక్ లో పేరు తప్పు పడటం, విస్తీర్ణం హెచ్చు తగ్గులు రేషన్ కార్డుల్లో పేర్ల నమోదులో తప్పులు, నిధుల దుర్వినియోగం, పింఛన్ల లాంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మండల స్థాయి అధికారులు వీటిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఉన్నతాధికారుల సూచనలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో కలెక్టర్ డైరెక్టుగా వీడియో కాన్ఫరెన్స్ లో బాధితుల ఎదుటే మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.

ఇప్పటికే 900 వరకు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే చాలా మంది బాధితులు కలెక్టరేట్ కు రావడానికి ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి రూ. 500 వరకు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. ఇలాంటి వారి కోసం మండల స్థాయిలోనే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించినట్లయితే బాధితులు జిల్లా కేంద్రం వరకు వచ్చే అవకాశం ఉండదని కలెక్టర్ అధికారులకు చెబుతున్నారు. ఈ ప్లాన్ సక్సెస్ అయితే చాలా వరకు సమస్యలు మండల కేంద్రాల్లోనే పరిష్కారం అవుతాయి. దీంతో ప్రజావాణికి కలెక్టరేట్ కు వచ్చే సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. 

ధరణి పై సపరేట్ గా ...

ధరణి లో ఉన్న సమస్యల గురించి ప్రజావాణికి ఎక్కువ సంఖ్యలో బాధితులు వస్తున్నారు.  రెండు వారాల నుంచి ధరణి ఫిర్యాదులపై సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు.  ఫిర్యాదు చేసిన బాధితుని వివరాలు తీసుకుని అతడి సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు, పెండింగ్ లో ఉందనే సమాచారాన్ని 
చెబుతున్నారు.