ఆదిలాబాద్ జిల్లాలో చలి షురువైంది

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి
  • 12 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. వారం రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచే వాతావరణం చల్లబడి చలి తీవ్రత ప్రారంభం అయి ఉదయం 10 గంటల వరకు ఉంటోంది. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, తిర్యాణి, నేరడిగొండ, పెంబి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గతేడాది ఇదే టైంలో 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా ఈ సారి 12 నుంచి 13 డిగ్రీలు నమోదవుతున్నాయి. తిర్యాణి మండలంలోని గిన్నేదారిలో సోమవారం 12 డిగ్రీలు, నేరడిగొండలో 12.1, పెంబి 12.6 డిగ్రీలు, హజీపూర్ 13.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది నవంబర్‌‌‌‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

చల్లటి ఈదురుగాలులు..

అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌‌‌‌లో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఎండలు, చలి రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఈ ఏడాది సైతం నవంబర్‌‌‌‌లోనే చలి తీవ్రత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికే వణికిపోతున్నాయి. తెల్లవారుజామున పొగమంచుతో రోడ్లన్నీ కమ్మేస్తున్నాయి.

ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, పాల వ్యాపారులు, మున్సిపల్ కార్మికులు, పేపర్‌‌‌‌ బాయ్స్‌‌‌‌.. ఇలా ఉదయం పూట పనులకు వెళ్లే వారిపై చలి ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది వర్షాలు సైతం అధికంగా ఉండడంతో చలి తీవత్ర సైతం అదే స్థాయిలో ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

జాగ్రత్తలు పాటించాల్సిందే..

జిల్లాలో రోజురోజుకు చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలి కాలంలో వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. చలికాలంలో దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి, ఊపిరిత్తుల సమస్య వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికే చాలా మంది జ్వరాలతో హాస్పిటల్‌‌‌‌కు పరుగులు తీస్తున్నారు. చలి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రాల్లో పీహెచ్‌‌‌‌సీ డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

చిన్నపిల్లలను చలి నుంచి కాపాడేందుకు స్వెటర్లు, కాళ్లకు, చేతులకు గ్లౌజ్‌‌‌‌లు, ముఖానికి మాస్క్‌‌‌‌ ధరించేలా చూసుకోవాలని చెబుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి ఉదయం, సాయంత్రం టైంలో ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకోవాలని, వేడివేడి పదార్థాలనే తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.