చిన్న పిల్లలు ఉండే ఇంట్లో ఈ ఛానెల్‌లోని ఒక్క వీడియో అయినా ప్లే అయ్యే ఉంటుంది. మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్లో చాలామంది ఈ ఛానెల్‌లోని వీడియోలని ఇష్టపడుతున్నారు.అందుకే ‘కోకోమెలన్’ ఛానెల్‌కు ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు! కొన్నేండ్ల క్రితం ఓ జంట తమ పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయాలని ట్రై చేస్తే పుట్టిందే ఈ ఛానెల్.
‘కోకోమెలన్–నర్సరీ రైమ్స్’ అనేది పిల్లల కోసం పెట్టిన యూట్యూబ్ ఛానెల్. ఇందులో పిల్లల పాటలు, రైమ్స్ త్రీడీ యానిమేటెడ్ కార్టూన్స్‌లో క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. ఈ వీడియోల్లో ఎక్కువగా ముగ్గురు పిల్లలు, వాళ్ల పెట్స్‌తో ఉన్న ఒక కుటుంబం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే స్కూల్‌కు వెళ్తున్న పిల్లలతో పాటు ప్రి–స్కూల్ పిల్లలు కూడా ఈ ఛానెల్ వీడియోలను బాగా చూస్తుంటారు. ఇందులో చాలా నర్సరీ రైమ్స్, పాటలు ఉన్నాయి. అందుకే ఈ ఛానెల్‌కు ప్రతి నెలా దాదాపు రెండు నుండి మూడు మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు పెరుగుతూనే ఉన్నారు.
పిల్లల కోసం...
కోకోమెలన్ ఛానెల్‌ని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న జే. జియోన్, అతని భార్యతో కలిసి మొదలుపెట్టాడు. ఏడుస్తున్న వాళ్ల పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సరదాగా ఉండే వీడియోలు చేయాలి అనుకున్నాడు జియోన్. అతనికి యానిమేషన్ వర్క్ బాగా తెలుసు. దాంతో ఆ ఆలోచన వచ్చిన వెంటనే వీడియోలు చేశాడు. వాటిని చూసిన పిల్లలు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. దాంతో వాటినే యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయాలి అనుకున్నాడు. అందుకోసం 2006 సెప్టెంబర్‌లో ‘దట్స్ మీ ఆన్ టీవీ’ పేరుతో ఛానెల్ పెట్టి మొదటి వీడియో(ఆల్ఫాబెట్ సాంగ్)ను అప్‌లోడ్ చేశాడు జియోన్.
ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రెగ్యులర్‌గా వీడియోలు చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ.. తొమ్మిది నెలల తర్వాత రెండో వీడియో అప్‌లోడ్ చేశాడు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఛానెల్‌లో రెగ్యులర్‌గా వీడియోలు అప్‌లోడ్ చేశాడు.
రీబ్రాండ్
ఛానెల్ బాగా నడుస్తున్నప్పుడే 2013లో ఛానెల్‌ని రీబ్రాండ్ చేసి ‘ఏబీసీ కిడ్ టీవీ’ అని పేరు పెట్టారు. అప్పటినుంచి ఛానెల్‌లో రైమ్స్, పాటలు ఎక్కువగా అప్‌లోడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే 2016 తర్వాత పిల్లలను ఇంకా బాగా ఆకట్టుకోవాలని 2డి, 3డి యానిమేషన్ వీడియోలు అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 18న ఛానెల్‌ని మళ్లీ రీబ్రాండ్ చేశారు. ఈ సారి ఛానెల్ పేరుని ‘కోకోమెలన్–నర్సరీ రైమ్స్’ అని పెట్టారు. రీబ్రాండింగ్ తర్వాత ఛానెల్‌కు సబ్‌స్క్రయిబర్స్ బాగా పెరిగారు. వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి.
అంచెలంచెలుగా...
ఛానెల్ 2016 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. టీ సిరీస్, సెట్ ఇండియా లాంటి పెద్ద ప్లాట్‌ఫామ్స్‌కి పోటీగా నిలిచింది. ప్రస్తతం ఈ ఛానెల్‌ను 172 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ఛానెల్‌లో 1,093 వీడియోలు అప్‌లోడ్ చేశారు. యూట్యూబ్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పిల్లలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ ఛానెల్ కింద వివిధ భాషల్లో మరో 33 ఛానెల్స్ నడుపుతున్నారు. కోకోమెలన్‌ను 2020 జూలై 30న ‘మూన్‌బగ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే బ్రిటిష్ కంపెనీ కొన్నది. కానీ ‘ట్రెజర్ స్టూడియో’ అనే అమెరికన్ కంపెనీ ఈ ఛానెల్ మెయింటెనెన్స్ చూసుకుంటుంది. మూన్‌బగ్ కంపెనీ కింద ‘బ్లిప్పి, లిటిల్ బేబీ బమ్’ అనే పిల్లల ఛానెల్స్ కూడా ఉన్నాయి.
కోకోమెలన్ వీడియోలు యూట్యూబ్‌లోనే కాకుండా ‘నెట్‌ఫ్లిక్స్, హులు, రొకు’ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల్లో బాత్ సాంగ్ వీడియోకు ఏకంగా 6.6 బిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదొక్కటే కాదు.. బిలియన్ వ్యూస్ దాటిన వీడియోలు ఛానెల్‌లో చాలానే ఉన్నాయి. షార్ట్ వీడియోల విషయానికి వస్తే.. మిలియన్ కంటే తక్కువ వ్యూస్ ఉన్న వీడియోలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
ఆదాయం అనూహ్యం
- ఛానెల్ ద్వారా జియోన్ ఇప్పటివరకు 790 మిలియన్ల అమెరికన్ డాలర్లు సంపాదించాడనేది ఒక అంచనా.
- ప్రస్తుతం ఛానెల్‌కు ప్రతి నెలా మిలియన్లలో ఆదాయం వస్తోంది.
- యూట్యూబ్ నుంచే కాకుండా ఇతర సోషల్ మీడియా, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి కూడా సంపాదిస్తున్నారు.
- ఛానెల్‌కు అమెరికా నుంచి ఎక్కువ వ్యూస్ వస్తుండడంతో ఆదాయం కాస్త ఎక్కువగానే ఉంది.