ఇవాళ (డిసెంబర్ 7) నల్గొండకు సీఎం రేవంత్ రెడ్డి

  • బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న రేవంత్
  • మెడికల్ కాలేజీ వద్ద లక్ష మందితో బహిరంగ సభ

నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్  రెడ్డి శనివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌  ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను సీఎం రేవంత్‌‌  ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కాల్వలకు నీరు విడుదల చేసే బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం, దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌‌  పవర్‌‌  ప్లాంటును సీఎం ఓపెన్  చేయనున్నారు. 

అదేవిధంగా మెడికల్‌‌  కాలేజీని కూడా ఆయన ప్రారంభిస్తారు. అక్కడే నిర్మించనున్న నర్సింగ్‌‌  కాలేజీ,  నల్గొండ మునిసిపాలిటీ పరిధిలోని రైతుబజార్‌‌  వద్ద నిర్మించనున్న స్కిల్  డెవలప్ మెంట్  సెంటర్ కూ శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ పక్కన ఉన్న ఎస్ఎల్బీసీ రాజీవ్  ప్రాంగణంలో  నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం మీదుగా హైదరాబాద్‌‌  బయలుదేరతారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జాతికి అంకితం

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బ్రాహ్మణ వెల్లంల- ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్  రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. ఈ పథకం కింద మొదటి దశలో 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పూర్తయ్యాయి.

 రిజర్వాయర్‌‌  ప్రారంభించడంతో పాటు, రిజర్వాయర్‌‌  నుంచి కాల్వలకు నీటిని సీఎం విడుదల చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్‌‌ రాజశేఖర్‌‌ రెడ్డి వద్ద పట్టుబట్టి మంజూరు చేయించుకున్న ఈ పథకం 18 ఏళ్ల తర్వాత మళ్లీ వెంకట్ రెడ్డి మంత్రి అయ్యాకే పూర్తయింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. అదేవిధంగా 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో  చేపట్టిన యాదాద్రి థర్మల్‌‌  పవర్‌‌  ప్లాంట్‌‌లో యూనిట్‌‌  ద్వారా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సీఎం రేవంత్‌‌, మంత్రులు ఉత్తమ్‌‌, కోమటిరెడ్డి  ప్రారంభించనున్నారు.