ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే.. లగచర్ల ఘటనపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

వేములవాడ: తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడుతోందని.. లగచర్లలో కొందరిని ఉసిగొల్పి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

‘‘నా సొంత నియోజకవర్గం కొడంగల్‎లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు భూ సేకరణ చేస్తే.. రౌడీ మూకలను  తయారు చేసి కలెక్టర్‎ను, అధికారులను కొట్టారు. కేసులు కడితే ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వైఖరిని కేసీఆర్ సమర్థిస్తున్నారా..? పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం మీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ చేయలేదా, అలాగే ఇప్పుడు మేం కొడంగల్‎లో భూసేకరణ చేస్తే మీ కడుపు మంట ఎందుకు.

ALSO READ | ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను KCR మోసం చేసిండు: సీఎం రేవంత్

గ్రామాల్లో మనకు ఉన్నా ఆత్మ గౌరవం భూమి అనే విషయం నాకు తెల్వదా.. కానీ భూ సేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా ఏర్పాటు చేస్తారు..? అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. భూ సేకరణలో భూమి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ల్యాండ్ రేట్‎కు మూడు రెట్లు పెంచి నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించా. కేటీఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నా.. ఇంకా ఎంత దూరం ఉరుకుతారో చూస్తా.  భూ సేకరణలో కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్కపెట్టాల్సిందే’’ అని హాట్ కామెంట్స్ చేశారు.