రాష్ట్రాన్ని కేసీఆర్‌‌‌‌ అప్పుల్లో ముంచిండు : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • సీఎం రేవంత్‌‌ ఆధ్వర్యంలో ప్రజాపాలన : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని వెల్లడి
  •  బెల్లంపల్లిలో సీఎం రేవంత్​బర్త్ డే వేడుకలు

కోల్​బెల్ట్/మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు :​ తెలంగాణలో పదేండ్ల దొరల పాలనను సీఎం రేవంత్ రెడ్డి అంతం చేశారని, ఆయన సారథ్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌, స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను నిర్వహించి, కేక్ కట్ చేశారు. సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ బర్త్ డే విషెస్ చెప్పారు. 

బెల్లంపల్లిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్టాప్‌‌ను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చే వారి కోసం సీఎం బర్త్​డే సందర్భంగా బస్టాప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల పేషెంట్లకు, ఆసుపత్రి సిబ్బందికి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుందన్నారు. గత సర్కార్‌‌‌‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వాన్నంగా మార్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు. మరోవైపు, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఆర్వోబీ పనులను వంశీకృష్ణ పరిశీలించారు. 

గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఆర్వోబీ పనులు ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదని కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకటస్వామి ఉన్న కాలంలో ఈ ఆర్వోబీ మంజూరైందని గుర్తుచేశారు. 1.6 కిలోమీటర్ల ఆర్వోబీ అప్రోచ్ రోడ్డును డిసెంబర్‌‌‌‌లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేకపోతే కాంట్రాక్టర్‌‌‌‌ను బ్లాక్‌‌ లిస్ట్‌‌లో పెడతామని హెచ్చరించారు. ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన ఫ్లై యాష్​ సప్లైకు సహకరించాలని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆఫీసర్లకు సూచించారు.

మంచిర్యాలలో వందేభారత్ రైలు హాల్టింగ్‌‌కు కృషి.. 

మంచిర్యాల రైల్వే స్టేషన్‌‌లో కేరళ ఎక్స్‌‌ప్రెస్, వందే భారత్ రైళ్ల హాల్టింగ్ కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరినట్టు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్‌‌లో మార్నింగ్ వాక్ సందర్భంగా వాకర్లు, ప్లేయర్స్, కోచ్‌‌లతో మాట్లాడారు. కాసేపు క్రికెట్, బాక్సింగ్​ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరించారు. గ్రౌండ్‌‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 

అష్టోత్తర యోగా పీఠం ఆధ్వర్యంలో ఎంపీని సన్మానించారు. అలాగే, మంచిర్యాల బాయ్స్ హైస్కూల్‌‌లో జిల్లా యువజనోత్సవాలు, సైన్స్ ఫెయిర్‌‌‌‌ను ఎంపీ ప్రారంభించి మాట్లాడారు. సైన్స్, టెక్నాలజీ ద్వారా మంచిర్యాలకు చెందిన సాయి శ్రీవల్లి అనే స్టూడెంట్ జపాన్‌‌కు వెళ్లడం గొప్ప విషయమని కొనియాడారు.