రైతు రుణం తీర్చుకున్న సీఎం రేవంత్

తెలంగాణలో రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీ దేశచరిత్రలోనే రికార్డు. బీఆర్ఎస్ చేతులెత్తేస్తే  రైతన్నకు కాంగ్రెస్ చేయూతనిస్తోంది.  వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని ప్రభుత్వం నిరూపిస్తున్నది.  రైతును రాజు చేయడమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి  రేవంత్​ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలన కొనసాగుతున్నది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.  

రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి కేటాయించడం రికార్డు.  దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇన్ని వేల కోట్ల రూపాయలకు రైతుల కోసం కేటాయించలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 

2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్​లో  రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.  దీంతో ఓట్లు వేసి కాంగ్రెస్ ను గెలిపించినందుకు కృతజ్ఞతగా రైతుల రుణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చుతున్నారు. 

రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు.ఈనెల 18న మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు పంట రుణాలు ఉన్న 11, 34,412 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6034. 96 కోట్లను జమ చేసి రుణమాఫీ చేపట్టింది.  అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి జులై 30న  ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 12 రోజుల్లో రూ. 12 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 

లక్షన్నరలోపు ఉన్న ఆరు లక్షల 40 వేల మందిని రుణ విముక్తులను చేసింది. ఇందుకోసం రూ. 6190 కోట్లను ఆరు లక్షల నలభై వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. 

ఒకేసారి రుణమాఫీ చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం

ఇలా ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి 17,75,235 మంది రైతుల క్రాప్ లోను ఖాతాల్లో రూ.12, 224,98 కోట్లు జమ చేసింది. స్వాతంత్ర్య భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు.  ఏ రాష్ట్రంలోనూ రూ. 31 వేల కోట్లు కేటాయించలేదు.  రైతు రుణమాఫీలో  దేశ చరిత్రలోనే  తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పట్టు వదలని విక్రమార్కుడిలా సీఎం  రేవంత్ రెడ్డి,  మంత్రులు సమష్టిగా కృషిచేసి రుణమాఫీ చేస్తున్నారు.  

ఆగస్టు 15లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.  పాత రుణాలను మాఫీ చేయడం..మళ్లీ పంటల సాగు కోసం రైతులకు రుణాలు  అందించేందుకు కృషి చేస్తున్నారు.  రెండు విధాల రైతులకు ప్రయోజనం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతులను మోసగించిన బీఆర్ఎస్​

రెండవసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ. 12 వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ. 7000 కోట్ల రుణాలు మాఫీ చేయలేదు. పదేండ్ల కాలంలో లక్ష వరకు అది కూడా నాలుగైదు విడతలుగా కేవలం రూ. 25 వేల కోట్లు రుణమాఫీని సరిగా చేయలేకపోయింది. బీఆర్ఎస్  రైతులను మోసగించింది. 

దీంతో  ప్రజలు బీఆర్ఎస్ కు  కర్రు కాల్చి వాత పెట్టారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  8 నెలల్లోనే రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయడం రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. అప్పుల్లో  కూరుకుపోయిన రాష్ట్రంలో  రుణమాఫీ ఎలా చేస్తారని కొందరు కాంగ్రెస్​ను అవహేళన చేశారు.  కానీ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో  ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం. 

తెలంగాణను తాకట్టుపెట్టిన బీఆర్ఎస్​ సర్కార్​

గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది.  కాంగ్రెస్​ ప్రభుత్వం తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా  రైతు,  ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు  ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తున్నది.  ఒకటో  తేదీనే  ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు చెల్లిస్తున్నది.  

వృద్ధులకు,  ఒంటరి మహిళలకు,  దివ్యాంగులకు ప్రతినెల పింఛన్ల పంపిణీ,  ఆర్టీసీ బస్సుల్లో  మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణం సౌకర్యం, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు,  గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం. 

ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.  ప్రజా ప్రభుత్వం నూటికి నూరుశాతం  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 

పంటల బీమా హామీ సైతం నెరవేరుస్తున్న సీఎం

 రైతులు కష్టపడి పండిస్తున్న పంటలకు బీమా కల్పించేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. పంటలకు నష్టం జరిగితే బీమా కంపెనీ నుంచి పరిహారం చెల్లిస్తుంది. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పంటల బీమాను కూడా అమలు చేయలేకపోయింది. 

ఇది వారి అసమర్థతకు  నిలువుటద్దంగా నిలుస్తోంది. పదేండ్ల కాలంలో  కేసీఆర్​ సర్కారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్. దీనికి పర్యవసానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రూ.43 వేల కోట్లు వడ్డీలకు చెల్లించింది. - 

వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జ్​