వాళ్లవి త్యాగాలు.. మీవి భోగాలు...దేశం కోసం ఇందిర, రాజీవ్​ ప్రాణత్యాగం : సీఎం రేవంత్​ రెడ్డి

  • సోనియా, రాహుల్​ పదవీ త్యాగం చేసిన్రు
  • కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుతిన్నది: సీఎం
  • మీ ఫామ్​హౌస్​లలో ఇక జిల్లేల్లు మొలుసుడే 
  • పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తురాలే?
  • మేము రాజీవ్​ విగ్రహం పెడ్తామనగానే కూలుస్తామంటరా?
  • ఎవరొస్తరో రండి.. తేల్చుకుందామని హెచ్చరిక
  • డిసెంబర్​ 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహం పెడ్తమని వెల్లడి
  • పార్టీ ఆఫీసుకు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్​నే మరిచిన చరిత్ర కేసీఆర్​దని ఫైర్
  • సెక్రటేరియెట్​ సర్కిల్​లో మాజీ ప్రధాని రాజీవ్ ​విగ్రహావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ఇందిర, రాజీవ్​ ప్రాణత్యాగం చేస్తే.. సోనియా, రాహుల్​ పదవీ త్యాగం చేశారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కానీ, పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం పదవులు పంచుకొని, రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని మండిపడ్డారు. వేల కోట్లు కూడబెట్టుకొని భోగాలు అనుభవించేటోళ్లకు త్యాగం అంటే ఏమిటో ఎప్పటికీ అర్థం కాదని బీఆర్ఎస్​ నేతలపై ఫైర్​ అయ్యారు. సెక్రటేరియెట్ బయట సర్కిల్​లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు.‘‘ఏపీలో పార్టీ నాశనం అవుతుందని తెలిసినా.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అలాంటి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలుస్తామంటున్నారు. ఎవరు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కరు రండి.. తారీఖు, టైం చెప్పండి.. ఎవరు వస్తారో నేను చూస్తా’’ అని సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. 

‘‘గాంధీ కుటుంబం గురించి కేసీఆర్‌‌ ఫ్యామిలీకి తెలు సా.. అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా?’’ అని తీవ్రంగా స్పందించారు. డిసెంబర్ 9న దేశం అబ్బురపడే రీతిలో సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లోకి బీఆర్ఎస్​ కాలకేయ ముఠా వస్తోందని, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ‘‘మిడతల దండై తెలంగాణను మరోసారి కబళించాలని కుట్రలు చేస్తున్నారు. ఈ దండును పొలిమేరలు దాటే వరకు తరిమే బాధ్యత మీది, నాది. ఆనాటి సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ గడీలో పల్లేర్లు మొలవాలె అని పిలుపునిచ్చారు. ఆ పోరాటం వల్లే గడీల్లో గడ్డి మొలిసి ప్రజాస్వామ్య పాలన మొదలైంది. ఇవాళ రాజీవ్​ విగ్రహం సాక్షిగా చెప్తున్నా.. కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్​లో ఇక జిల్లేల్లు మొలిపిస్తా..’ అని సీఎం హెచ్చరించారు.  ‘ఇది రాజకీయ సభ కాదు.. ఇలాంటి కార్యక్రమంలో రాజకీయ విషయాలు ప్రస్తావించడం నాకు  ఇష్టం లేదు. కానీ, త్యాగం అంటే ఏమిటో తెలియనని వాళ్లు ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. వారికి త్యాగం అంటే ఏంటో గుర్తుచేయాల్సిన బాధ్యత సీఎంగా నా మీద ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం  జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూది. స్వాతంత్య్రం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం. రాజీవ్ గాంధీ మరణించినా సోనియా ఏ పదవీ తీసుకోలేదు. ప్రాణత్యాగం అంటే ఇందిర, రాజీవ్  లది. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది’’ అని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ​ఐదేండ్ల పాటుమహిళకు మంత్రి పదవి ఇవ్వలే

గాంధీలది కుటుంబ పాలన అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్​ ఏ పదవి తీసుకోలేదన్నారు. కానీ, తెలంగాణలో కేసీఆర్ సీఎం, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి మంత్రి, బిడ్డ ఎంపీ, బంధువు రాజ్యసభ సభ్యుడు.. ఇలా  పదవులన్నీ పంచుకుని, రాష్ట్రాన్ని దోచుకుని వందలాది ఎకరాల్లో ఫామ్ హౌస్​లు కట్టుకున్నోళ్లు గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతారా? అని మండిపడ్డారు. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూదన్నారు. ‘‘దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్‌‌ గాంధీ. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది ఆయనే. స్థానిక సంస్థల్లో రాజీవ్​ గాంధీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్లే ఇవాళ మహిళలంతా కుర్చీల్లో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. కానీ, గత పాలకుల హయాంలో ఐదేండ్ల వ్యవధిలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకా వాళ్లకు ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి’’ అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

 ‘‘మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది నెహ్రూ కాదా? ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్​కు పునాదులు వేసిన ఘనత నెహ్రూది కాదా? నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ మనకు అందించిన సంపద. ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారు.

 రాజభరణాలు రద్దు చేసి ఘనత ఆమెది. దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు సొంతింటి కలను నిజం చేశారు. లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ’’ అని గుర్తుచేశారు. ‘‘దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ కాదా? దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసిన త్యాగశీలి ఇందిరమ్మ కాదా? దేశ భవిత యువత చేతుల్లో ఉండాలని 18 ఏండ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ కాదా?  రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకాదా?’’ అని  రేవంత్​ రెడ్డి నిలదీశారు.

కేటీఆర్​ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకుంటుండే..

రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్​ను పరిచయం చేశాడు కాబట్టే కేటీఆర్ ఐటీ శాఖకు మంత్రి అయ్యాడని.. లేకుంటే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘కేటీఆర్​ అమెరికా పోయి చదివి.. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిదంటే రాజీవ్​ గాంధీ పుణ్యమే. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగానే ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాదుకోవడం చిత్రంగా ఉంది. పదేండ్లు అధికారంలో ఉండగా, తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు. అప్పుడు గాడిద పళ్లుతోమారా?’’  అని మండిపడ్డారు. అసలక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన వాళ్లకు లేదని, బుద్ధిలేని కేసీఆర్ తన విగ్రహాన్ని పెట్టాలనుకుని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారని సీఎం అన్నారు. ‘‘వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్, వంద ఎకరాల్లో జన్వాడలో ఫాంహౌస్, 10 ఎకరాల్లో ప్రగతి భవన్, లక్ష కోట్ల రూపాయలు దిగమింగి కాళేశ్వరం ప్రాజెక్టు  కట్టుకున్న మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేండ్లు సరిపోలేదా?’’ అని సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్​ అయ్యారు.

 ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌, శ్రీధర్‌‌ బాబు, సీతక్క, కొండా సురేఖ, రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్‌‌ పార్టీ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ దీపాదాస్‌‌ మున్షీ, సీఎస్​ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


రాజీవ్​ విగ్రహం ఏర్పాటు​ ఐడియా సీఎందే: పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియెట్ ముందు పెట్టాలనే ఇన్నోవేటివ్ ఐడియా సీఎం రేవంత్ రెడ్డిదేనని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.  గాంధీ కలలు కన్న విధంగా దేశం నడవాలని రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం చూపించారని అన్నారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పంపించిన నేత రాజీవ్ అని ఆయన కొనియాడారు. నేడు మనం వాడుతున్న సెల్‌‌ఫోన్లు 1995, 96లో వచ్చాయని.. ఆనాడు రాజీవ్ గాంధీకి నెహ్రూలా దూరదృష్టి లేకుంటే.. సెల్‌‌ఫోన్స్ మనకు 2005 వరకు వచ్చేవి కాదన్నారు. ఈ దేశం సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ పరంగా 21వ శతాబ్దానికి పోవాలని, పరిపూర్ణమైన టెక్నాలజీతో ముందుకు పోవాలని రాజీవ్​ కలలు కన్నారని అన్నారు. ఆయన కల సాకారమైందన్నారు. రాజీవ్ గాంధీ భౌతికంగా లేకున్నా.. 18 ఏండ్లకు ఓటు హక్కు వచ్చిన ప్రతి వ్యక్తి, సర్పంచ్‌‌‌‌గా పని చేసిన ప్రతి వ్యక్తి, నీతి నిజాయతీగా పనిచేయాలనుకునే ప్రతి వ్యక్తి మదిలో ఉంటారని మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. 

కేసీఆర్ ఫాంహౌస్​లో షాక్​ ట్రీట్మెంట్​ తీసుకుంటుండు

‘‘కేసీఆర్​కు నిలువ నీడ లేనప్పుడు ఆశ్రయమిచ్చిన కొండా లక్ష్మణ్ బాపు మరణిస్తే.. కనీసం ఆఖరి చూపునకు కూడా కేసీఆర్ పోలేదు. ఇంతకంటే దుర్మార్గుడు ఈ భూమి మీద ఇంకెవరైనా ఉంటారా? ’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘మేము అధికారంలోకి వచ్చాక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపు పేరును, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టాం. పాత్రికేయుడు, సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి పెట్టబోతున్నాం. ఈ పదేండ్లు వీటికి తెలంగాణ వారి పేర్లు పెడితే ఎవరైనా వద్దన్నారా?  అధికారం పోయింది, ప్రజా పాలన వచ్చింది, గడీలు బద్దలైపోయాయి. వారి బతుకులు దివాళా తీశాయనే వాస్తవం కేసీఆర్​కు ఇంకా అర్థం కావడం లేదు. ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అందుకే కేసీఆర్​కు రెగ్యులర్​గా ఫామ్ హౌస్​లో షాక్ ట్రీట్ మెంట్ నడుస్తోంది. ఈ లోపు కొంతమంది చిల్లర మల్లర గాళ్లను మనపై మాట్లాడిస్తున్నారు’’ అని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు.