గడువులోగా రుణమాఫీ చేసినం..ఇదీ.. మా మార్క్

  • సాధ్యం కాదన్నోళ్ల నోర్లు మూయించినం: సీఎం రేవంత్ రెడ్డి
  • అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దు
  • అలాంటోళ్ల కోసమే రూ.5 వేల కోట్లు రిజర్వ్ చేసినం  
  • ఎవరైనా ఉంటే కలెక్టర్ ఆఫీసుల్లో ఫిర్యాదు చేయొచ్చు 
  • రుణమాఫీ చేసినంత మాత్రాన ఇతర పథకాల్లో ఎలాంటి కోతలుండవ్
  • అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం
  • ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం కేసీఆర్​కు గవర్నర్, కేటీఆర్​కు 
  • కేంద్రమంత్రి పదవులొస్తయ్.. కవితకు బెయిల్ కూడా వస్తదని కామెంట్ 
  • ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్ చాట్

న్యూఢిల్లీ, వెలుగు : ఆగస్టు 15 డెడ్​లైన్ పెట్టుకుని, ఆ గడువులోగా రుణమాఫీ చేసి పాలనలో తమ మార్క్​ ఎలా ఉంటుందో చూపించామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘రుణమాఫీ ఎట్ల చేస్తరు? అసలు సాధ్యం కానే కాదు? అన్నోళ్ల నోర్లు మూయించాం. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం. ఇప్పుడు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఐదేండ్లలో నాలుగు వాయిదాల్లో కూడా రుణమాఫీ పూర్తి చేయలేదు’’  అని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్​చాట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు.

ఏదైనా కారణంతో రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దని, అలాంటి వాళ్ల కోసం కలెక్టరేట్‌ కార్యాలయాల్లో గ్రీవెన్స్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘మా వద్ద ఉన్న డేటా ప్రకారం రైతు రుణమాఫీకి రూ.26 వేల కోట్లు అవసరం. కానీ అందరినీ దృష్టిలో ఉంచుకుని రూ.31 వేల కోట్లకు బడ్జెట్‌లో అప్రూవల్‌ ఇచ్చాం. ఏదైనా కారణంతో రుణమాఫీ కాని రైతుల కోసమే అదనంగా రూ.5 వేల కోట్లు రిజర్వ్ చేశాం’’ అని చెప్పారు. 

బీజేపీ, బీఆర్‌‌ఎస్ నేతలు రుణమాఫీపై ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు.. కలెక్టరేట్​లలో ఏర్పాటు చేసిన  గ్రీవెన్స్ సెల్‌‌లో రైతులకు సాయం చేయాలని సూచించారు. అవసరమైతే వలంటీర్లుగా మారాలని అన్నారు. రుణమాఫీ చేసినంత మాత్రానా, ఇతర పథకాల్లో ఎలాంటి కోతలు ఉండవని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్ తనకు తోచింది చేసిండు. నచ్చిన కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చుకుంటూ పోయిండు. కానీ మేం అలా చేయడం లేదు. ప్రతి నెలా ఫస్ట్ కే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోసం రూ. 5వేల కోట్లకు పైచిలుకు, లోన్ల కోసం రూ. 6,500 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నాం. లోన్ల కింద 2014లో ఏడాదికి రూ.6,500 వేల కోట్లు చెల్లిస్తే.. ఇప్పుడు అంత డబ్బు నెలనెలా కట్టాల్సి వస్తోంది” అని పేర్కొన్నారు. 

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం బిల్లు పెట్టాలి.. 

గ్రేటర్ హైదరాబాద్​పరిధిలోని సర్కార్ భూములు, చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ అన్నారు. అందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. హైడ్రాలో సివిల్ సొసైటీలను భాగస్వాములను చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఎవరినీ భాగస్వాములం చేయం. పని చేసే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. కూల్చివేతలను కొందరు ఎంఐఎం నేతలు వ్యతిరేకిస్తూ.. ఇలాంటి చర్యలు యాక్ట్ లో లేవని చెబుతున్నారు. అట్లయితే వాటి కోసం ఆర్డినెన్స్ తెస్తాం. అప్పుడు పంచాయితే ఉండదు” అని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌‌ను అరికట్టడానికి టీజీన్యాబ్‌‌ సమర్థంగా పని చేస్తున్నదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

‘‘పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ రాష్ట్ర పర్యటనలో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించారు. అది పార్టీ మేనిఫెస్టోలోనూ పెట్టాం. నేను సీఎం అవ్వగానే మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసి న్యాయపరంగా ముందుకెళ్లాం. సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్లను పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వాయిస్ వినిపించాం. కానీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగకు బిగ్ హగ్ ఇచ్చిన మోదీ.. ఇప్పుడు ఏ క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బీజేపికి చిత్తశుద్ధి ఉంటే, ఉభయ సభల్లో బిల్లు పెట్టాలి” అని డిమాండ్ చేశారు. 

అందుకే కేసీఆర్, జగన్ ఉద్యోగాలు ఊడినయ్.. 

ప్రతిపక్ష నేతలను అణగదొక్కాలనే ఆలోచన సరైంది కాదని సీఎం రేవంత్ అన్నారు. అలా చేసినందుకే కేసీఆర్, జగన్ తమ ఉద్యోగాలు (సీఎం పదవులు) కోల్పోయారని కామెంట్ చేశారు. ‘‘ఏపీ, తెలంగాణలో ప్రతిపక్ష నేతలను జైల్లో పెడితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేసీఆర్ నన్ను జైల్లో పెడ్తే.. ఇప్పుడు నేను సీఎం అయ్యాను. అలాగే చంద్ర బాబును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే... అక్కడ ఆయన కూడా సీఎం అయ్యారు. అణగదొక్కే విధానాన్ని ప్రజలు అంగీకరించరు” అని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువు కాదని, కేవలం కొలిగ్ మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు తనను రాజకీయ నేతగా తీర్చదిద్దలేదని, తానే స్వయంగా ఎదిగానని పేర్కొన్నారు.

పార్టీ పాలసీనే తన పాలసీ అని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పై బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో సందర్భంలో ఒక్కోలా కామెంట్ చేశాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అన్నారు. కానీ ఇప్పుడు అసలు అపోజిషన్ పార్టీ ఉంటుందా? ఉండదా? అనే పరిస్థితి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో టీడీపీ ఉంటుందా? ఉండదా? అనేది నాకు తెలియదు. జాతీయ అంశాలను పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది” అని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ వాళ్లకు అప్పుడు తెలంగాణ గుర్తుకురాలేదా? 

అభిషేక్ మను సింఘ్వి విషయంలో రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు... వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ గా నార్త్ వ్యక్తికి, మహారాష్ట్ర వ్యక్తికి మీడియా అడ్వైజర్ గా పదవులు ఇచ్చిన విషయం మర్చిపోయారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ గుర్తుకురాలేదా? అని నిలదీశారు. ఇక కేసీఆర్ పంటి, కంటి నొప్పికి కూడా ఢిల్లీకి వచ్చేవారని.. తెలంగాణలో డాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభకు పంపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

హైకమాండ్ నిర్ణయమే తమ నిర్ణయమని చెప్పారు. ‘‘వీహెచ్​హనుమంతరావు కాంగ్రెస్ లాయలిస్ట్. ఆయన లాంటి నేతలు ప్రస్తుతం చాలా అరుదు. అందుకే మూడుసార్లు పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి డిపాజిట్ కోల్పోయారు. ఈసారి వేరే దగ్గరి నుంచి పోటీలో దింపి, నా కేబినేట్ లో మంత్రిని చేశాం” అని అన్నారు. 

మా క్యాపిటల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ హైదరాబాద్‌‌.. 

మోదీకి, చంద్రబాబుకు హైదరాబాద్‌‌ లేదని... మోదీకి అహ్మదాబాద్‌‌, చంద్రబాబుకు విజయవాడ మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్​ హైదరాబాద్ అని.. ఫార్మా, ఐటీతో పాటు పలు రంగాల్లో హైదరాబాద్‌‌ బెస్ట్‌‌ ప్లేస్‌‌ అని చెప్పారు. హైదరాబాద్‌‌లోనే పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం రాష్ట్ర మంతటికీ కనెక్ట్‌‌ విటీ ఉందన్నారు. టైర్ 2, 3 సిటీల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘‘అమెరికాలో తెలుగు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజీగా ఉంది. ఎక్కువగా తెలుగు ప్రజలే ఐటీ కడ్తున్నారు. వాళ్లంతా ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదు. అది కూడా తెలంగాణలో పెట్టాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు. ‘‘కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు తీసుకువెళ్లారు?

అందుకే మేం ఢిల్లీకి వస్తున్నాం. ప్రధాని ఎప్పుడూ రాష్ట్రాలకు పెద్దన్నే. అదే విషయాన్ని నేను బహిరంగ సభలోనే చెప్పాను. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే ఎపిసోడ్‌‌ ముగిసింది. నాకు చంద్రబాబుతోనే కాదు... మోదీ, అమిత్‌‌ షాతోనూ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా మాత్రం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు.. అది ఆయన ఇష్టం. ఇవ్వకపోతే మేం చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. కేంద్రం రాష్ర్టానికి ఆర్థిక సాయం చేయనప్పుడు.. ప్రజలు రాజకీయంగా బీజేపీకి మద్దతు ఇవ్వరు” అని అన్నారు.  

పార్టీ నేతలకే పదవులు..  

పార్టీ నేతలకే కార్పొరేషన్ పదవులు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఈ పదవులు మూడేండ్లే ఉంటాయన్నారు. ఇప్పటికే పలువురికి అవకాశం కల్పించామని, మిగిలినోళ్లకు సెకండ్ రౌండ్ లో చాన్స్ ఇస్తామని తెలిపారు. ‘‘మూడేండ్లు పీసీసీగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. ఇప్పుడు ఆ బాధ్యతను హైకమాండ్​ఎవరికైనా అప్పగించవచ్చు. నన్ను పీసీసీగా నియమించే టైమ్​లో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. పార్టీ నియమించనంత వరకు మా అభిప్రాయలు చెప్తాం. ఇక నియమించిన తర్వాత ఎవరైనా సరే మా మనిషే” అని అన్నారు.

నాకు ప్రజలు ఇచ్చారు..నేను ప్రజలకు ఇస్తాను.. 

తాను ఏం చేసినా ఎవరో ఒక్కరి నుంచి వ్యతిరేకత వస్తున్నదని, తాను మాత్రం ఎవరికీ అన్యాయం చేయట్లేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘వ్యవస్థలు సక్రమంగా పని చేయాలని మాత్రమే నేను చెబుతున్నాను. ప్రజలు నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడిక నేను ప్రజలకు చేయాల్సిందే పెండింగ్‌‌లో ఉంది. ఈ దిశలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తాను. నేను ఇప్పటికే సీఎం అయ్యాను. ఇక మున్సిపల్, కార్పొరేషన్, ఇతర ఎన్నికలు నాకు ముఖ్యం కాదు. వాటి గురించి ఆలోచిస్తే.. ప్రజలకు చేసేదేమీ ఉండదు” అని పేర్కొన్నారు. ‘‘పెట్టుబడులు పెట్టాలని కంపెనీల డైరెక్టర్లు నిర్ణయిస్తేనే రాష్ట్రానికి ఇన్వెస్ట్ మెంట్స్ వస్తాయి. మనం వెళ్లి ప్రభుత్వ విధానాలు ఏంటో వివరిస్తే వారు చర్చించుకుంటారు కదా.

అందుకే విదేశీ పర్యటనకు వెళ్లాను. నన్ను కలిసినోళ్లందరూ, పెట్టుబడులు పెడతామని చెప్పినోళ్లందరూ.. రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తారని గ్యారంటీ లేదు. కానీ మన ప్రభుత్వ విధానాలు, మన దగ్గరున్న మౌలిక వసతుల గురించి వాళ్లకు తెలియాలి కదా.. అది చెప్పడానికే వెళ్లాం. ఢిల్లీలో ఉన్నోళ్లకే హైదరాబాద్‌‌లో ఏముందో తెలియదు. అలాంటిది అమెరికాలో ఉన్నోళ్లకు ఎట్ల తెలుస్తది? ఇంకో రెండేండ్ల తర్వాతనైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకుంటారు కదా’’ అని అన్నారు.  

కేటీఆర్​కు మెంటలా? 

కేటీఆర్​కు మెంటల్ ఎక్కిందా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘‘మాది దాదాపు 150 మంది తోబుట్టువులతో కూడిన పెద్ద ఫ్యామిలీ. ఇందులో 50 శాతానికి పైగా బంధువులు అమెరికాలో ఉన్నారు. నేను మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ చిన్న పదవి కూడా ఇవ్వలేదు. అసలు కేటీఆర్​కు ఏం సమస్య. నా కుటుంబం తెలంగాణలో పెట్టుబడి పెట్టొద్దు అంటున్నడు. 2000 తర్వాత కేటీఆర్ అమెరికా వెళ్లారు. కానీ, నా బ్రదర్స్ 1992, 93లోనే అక్కడ ఉన్నారు. మేం ఏడు గురం అన్నదమ్ములం. నేను సీఎం అయితే.. వాళ్లు అన్ని దందాలు బంజేసుకొని కూర్చో వాలా? వాళ్ల పనులు వాళ్లు చేసుకోవద్దా? కొందరు వాళ్ల ఆస్తి వాటా తీసుకుని వెళ్లారు. మరికొందరి వాటాలు ఇక్కడే ఉన్నాయి.

ఒక సోదరుడు తన సొంత డబ్బులతో ఆస్ట్రేలియా వెళ్లి ఫొటోలు దిగితే కేటీఆర్​కు వచ్చిన నొప్పేంటి? నా సోదరుడి ఫ్రెండ్ గడ్డితో ఇథనాల్ తయారు చేయడంలో పేటెంట్ పొందారు. ఆయన హైదరాబాద్​లో పెట్టుబ డులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో బీఆర్ఎస్​కు వచ్చే ఇబ్బంది ఏంటి? మా సర్కా రు ఎవరికీ అప్పనంగ ఆస్తులు ఇవ్వడం లేదు” అని అన్నారు.

‘నేను రాజకీయాల్లో లేనప్పుడే రూ.70 లక్షల ఖరీదైన ఫోన్ వాడాను. దాని ఖరీదు ఇప్పుడు కోటి. అమెరికా నుంచి నా సోదరులు ఎన్నో ఖరీదైన వస్తువులు తెచ్చే వారు. ఇవన్నీ తెలిసి కూడా కేటీఆర్ నా చెప్పుల గురించి  మాట్లాడుతున్నారంటే.. ఆయనకు బుర్ర లేనట్లే. కేసీఆర్ సొంత విమా నం కొనుక్కోవచ్చు గానీ, ఇతరులు ఖరీదైన చెప్పులు కొనుక్కోవద్దా?’’ అని ప్రశ్నించారు. 

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం.. 

బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి బేరసారాలు జరుగుతున్నాయని, ఎప్పటికైనా విలీనం తథ్యమని సీఎం రేవంత్ అన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్​కు గవర్నర్, కేటీఆర్​కు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయన్నారు. హరీశ్ రావు అపొజిషన్ లీడర్ అవుతా రని చెప్పారు. పార్టీ విలీనంతో రాజ్య సభలోని నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీ ఎంపీలుగా మారిపోతారని, దీనికి ప్రతిఫలంగా లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అలాగే కవితకు రాజ్యసభ పదవి కూడా వస్తుందని పేర్కొన్నారు.