సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు

  •  యాదగిరిగుట్ట అభివృద్ధి నివేదికల రూపకల్పనలో ఆఫీసర్లు బిజీబిజీ
  •  బుధవారం ఆలయ పరిసరాల్లో పర్యటించిన ఆర్ అండ్ బీ ఈఎన్సీ బృందం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో.. అధికారుల్లో కదలిక మొదలైంది. ఈ నివేదికతో ఈనెల 15న రివ్యూ సమావేశానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో ఆర్అండ్ బీ ఈఎన్సీ అధికారుల బృందం బుధవారం యాదగిరిగుట్టపై పర్యటించింది. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధానాలయం, ఆలయ మాడవీధులు, బస్ బే, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఈఓ క్యాంప్ ఆఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ఏఏ పనులు కంప్లీట్ అయ్యాయి?.పెండింగ్ లో ఉన్న పనులెన్ని? చెల్లించాల్సిన బిల్లులు ఎన్ని? ఇంకా ఏఏ పనులు చేపట్టాలనే విషయాలపై చర్చించారు.

కొండపైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంతంగా స్వామివారి దర్శించుకునే లా సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఆ దిశగానే రివ్యూలో చర్చ జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా భక్తులు కొండపైన నిద్ర కోసం కల్పించాల్సిన వసతులు, సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్చ జరిపారు. పెండింగ్ లో ఉన్న కమాన్(ఆర్చి) పనులను ఫినిష్ చేసి పెయింటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడం, ప్రధానాలయ దక్షిణ దిశలో కుంగిన ఫ్లోరింగ్ ను మరమ్మతులు విషయాలపై కూడా ఆఫీసర్లు చర్చించారు.

15నసెక్రటేరియట్ లో నిర్వహించే రివ్యూ లోపు ఇప్పటివరకు జరిగిన, ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులతో పాటు భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల గురించి సమగ్ర నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని ఆఫీసర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ క్యూసీ సీఈ పుల్లరాజు, ఆర్ అండ్ బీ సీఈ మోహన్ నాయక్, ఎస్ఈ వసంత్ నాయక్, క్యూసీ ఎస్ఈ సుదర్శన్ రెడ్డి, ఆలయ సివిల్ ఇంజనీరింగ్ ఈఈ దయాకర్ రెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ బీల్యానాయక్, ఏఈ కరుణాకర్, వైటీడీఏ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.