డిసెంబర్ 7న నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ..ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, వెలుగు: రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. బ్రహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం ద్వారా కాల్వలకు నీటి విడుదల చేయడంతోపాటు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్​లో యూనిట్‌‌‌‌–2 ద్వారా విద్యుదుత్పత్తిని సీఎం ప్రారంభిస్తారు.

నల్లగొండలోని మెడికల్‌‌‌‌ కాలేజీని ప్రారంభించి అక్కడే నర్సింగ్‌‌‌‌ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని రైతుబజార్‌‌‌‌ వద్ద స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ పక్కనే ఎస్ఎల్బీసీ వద్ద ‘రాజీవ్ ప్రాంగణంలో’ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. 

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి, కలెక్టర్‌‌‌‌..

సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌‌‌‌ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పటిష్టమైన బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, కలెక్టర్​తో కలిసి పర్యవేక్షించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్ బందోబస్తు కోసం మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈనెల 7న నల్గొండ జిల్లా కేంద్రంలో లక్ష మందితో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, అధికారులు తదితరులు ఉన్నారు.