రాష్ట్రాభివృద్ధికి సహకరించకుంటే .. మోదీనైనా ఉతుకుతం : సీఎం రేవంత్​

  • ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యల్ని చెప్పుడు తప్పా?
  • మా ప్రభుత్వాన్ని పడగొడ్తమంటే పేగులు తీసి మెడలేసుకుంటం
  • ప్రజలు బోర్లబొక్కలేసి బొక్కలు ఇరగ్గొట్టినా కేసీఆర్​కు సిగ్గురాలే
  • రోజమ్మ పెట్టిన రాగి సంకటి, కోడి పులుసు తిని ఏపీ నీటి దోపిడీకి అలుసిచ్చిండు
  • హరీశ్, కేటీఆర్ గాదె కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు
  • బీఆర్ఎస్, బీజేపీ పదేండ్లు పవర్​లో ఉండి ‘పాలమూరు’కు జాతీయ హోదా ఎందుకుతేలే
  • దొరల గడీలు పగలగొడ్తమని చెప్పి కేసీఆర్​ పక్కన్నే ఆర్​ఎస్​పీ చేరుడేందని ప్రశ్న

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడ్తానని, రాష్ట్రం అడిగిన నిధులు ఇవ్వకున్నా, అనుమతులు ఇవ్వకున్నా చాకిరేవు పెట్టి చిరిగే దాకా ఉతుకుతామని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘ప్రధాని మోదీకి సీఎం రేవంత్​ ఎందుకు వినతిపత్రాలు ఇచ్చిండని కొంతమంది సన్నాసులు అడుగుతున్నరు.. నేను మీ లాగా తలుపులు మూసి, కడుపుల తల్కాయ పెట్టి మోదీ కాళ్లు పట్టుకోలే.. చెవుల గుసగుసలు చెప్పలే..

ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే బాజప్తా ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన..’’ అని బీఆర్ఎస్​ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. ‘‘అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినం. మన సమస్యల్ని ఏకరువు పెట్టినం.

రేపు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగే దాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంట..’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి చేపట్టిన ‘పాలమూరు న్యాయ్ యాత్ర’ ముగింపు సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్​లో బుధవారం ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించారు. సభకు సీఎం రేవంత్​ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. 

కేంద్రం నుంచి ఏం తేవాల్నో తెలుసు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ వైఖరి ఉండవద్దని, దాని వల్ల రాష్ట్రానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని రేవంత్​ అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి సీఎం హోదాలో వినతిపత్రాలు ఇచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి కేంద్రాన్ని అడిగామని, రాష్ట్రానికి ఏం తేవాలో, కేంద్రం నుంచి ఏం రావాల్నో తనకు అవగాహన ఉందని అన్నారు. 

సభా ముఖంగానే తుమ్మిడి హెట్టికి అనుమతివ్వాలని, మెట్రో రైల్ నిర్మాణానికి, మూసీ ప్రక్షాళనకు, స్కైవేలకు,  ఫ్లైఓవర్లకు పర్మిషన్లు ఇవ్వాలని, ఫండ్స్​ ఇవ్వాలని,  ‘పాలమూరు’ స్కీముకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు రేవంత్​ వెల్లడించారు. ఇందులో ఏదో తప్పు ఉన్నట్లుగా కేసీఆర్​ ఫ్యామిలీ మతిభ్రమించి విమర్శలు చేస్తున్నదన్నారు. నిధులు, అనుమతులు ఇవ్వకపోతే మోదీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి కొట్లాడుతానని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ ఉంటే.. రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. జనానికి నష్టం జరుగుతుంది. సంఘర్షణ వైఖరి ఉండొద్దని తెలంగాణ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినం” అని అన్నారు. 

ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే పండబెట్టి తొక్కుతం

తాము అధికారంలోకి వచ్చి గురువారానికి 90 రోజులు అవుతుందని సీఎం  తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేశామని అన్నారు. ఈ నెల 11 నుంచి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతభత్యాలు చెల్లిస్తున్నామన్నారు. మూడు నెల్లలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి యువతలో విశ్వాసం కల్పించామని.. డీఎస్సీ, గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని సీఎం చెప్పారు. ‘‘మేము బాధ్యతతో పని చేస్తున్నం.

ఎవరికైనా అన్యాయం చేశామా? మరెందుకు మూడు నెలల్లో, ఆరు నెలల్లో మా ప్రభుత్వాన్ని పడగొడ్తమంటున్నరు? కేసీఆర్ ఎన్నికైతే పదేండ్లు సీఎంగా అధికారంలో ఉండొచ్చు. మోదీ ప్రధానిగా ఎన్నికైతే పదేండ్లు ఢిల్లీ దర్బార్​ను ఏలొచ్చు. ఇందిరమ్మ రాజ్యాన్ని ఆరు నెలలు కూడా ఉండనియ్యరంటరా? మీ  ఉద్దేశం, ఆలోచన ఏంది? ఇది ప్రజల చేత ఎన్నకున్న ప్రభుత్వం. ఎందుకు మా ప్రభుత్వాన్ని పడగొడ్తమంటున్నరు? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో ఉంటే చూసి ఓర్వలేకపోతున్నరు.

మాకు హక్కులు లేవా? నాలుగు కోట్ల ప్రజల్లో మేం లేమా? తెలంగాణ ఉద్యమంలో లేమా? కేసీఆర్ లాంటి బేకార్ గాన్ని పార్లమెంట్​కు పంపడమే మేము చేసిన తప్పా? కొడకల్లారా.. టచ్​ చేసి చూడండి. మా పాలమూరు బిడ్డలు అగ్నికణికలైతరు.. మానవబాంబులైతరు. టచ్​ చేస్తే ఎవడైనా మిగుల్తడేమో చూస్త. తమాషా చేస్తున్నరా? ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తమంటే పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతం. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా.. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి నిన్ను బజారు కీడ్చినం బిడ్డా. పాలమూరోళ్లకు ముంబై, దుబాయ్ వలస పోవుడే కాదు.. నీలాంటోళ్లను గోతి తీసి బొందపెట్టడం కూడా తెలుసు’’ అని సీఎం తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 

పదేండ్లలో వందేండ్ల విధ్వంసం చేసిండు..

రాష్ట్రాన్ని కేసీఆర్  సర్వనాశనం చేశారని రేవంత్​రెడ్డి అన్నారు. పదేండ్లలో వందేండ్ల విధ్వంసం చేశారని మండిపడ్డారు. ‘‘ఇప్పుడిప్పుడే రాష్ట్రం విధ్వంసం నుంచి బయటకు వస్తున్నది. రోజమ్మ పెట్టిన రాగి సంకటి, నాటు కోడి పులుసు తిని ఏపీకి కేసీఆర్​ అలుసిచ్చిండు. కృష్ణానది జలాలను ఏపీ ప్రభుత్వం రామలసీమకు తరలించుకుపోయినా, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చుమర్రిలోకి నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టినా పదేండ్లు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చాక అడుగుతుంటే మా కాళ్లకు కాళ్లు అడ్డం పెడుతున్నడు” అని ఫైర్​ అయ్యారు.

‘‘నీ లాగా నేను తాగుబోతును కాదు. నేను రేవంత్​రెడ్డిని. ఎప్పుడైనా హోష్​లో ఉంటా. జోష్​తో పనిచేస్తా. నీ కొడుకును సీఎం చేద్దామనుకుంటే పాలమూ రోడు అయ్యిండని నీకు కడుపు మంట. మొన్నటి ఎన్ని కల్లో ప్రజలు బోర్లబొక్కలేసి బొక్కలు ఇరగ్గొట్టినా సిగ్గు లేకుండా గల్లీల్లో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని తిడు తున్నవ్’’ అని కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హరీశ్​రావు ఆరు అడుగులు పెరిగిండు గానీ, మెదడు ఎక్కడుందో తెల్వదు. ఆయన దూలంలాగా పెరిగిండే కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు” అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు.

హరీశ్, కేటీఆర్​ పదేండ్లు గాదె కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దొచుకుతిని, తీరా పదవి పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. ‘‘మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని వీళ్లు అంటున్నరు. మరి 3,650 రోజులు కేడీ, 3,650 మోదీ అధికారంలో ఉండి పాలమూరు స్కీముకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కల్వకర్తి, భీమా, సంగంబండ, కోయిల్​సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా?” అని నిలదీశారు.

కరీంనగర్ నుంచి వచ్చిన కేసీఆర్ ను 2009లో పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘ఆర్టీఎస్ కోసం పాదయాత్ర చేసినట్లు చెప్పుకుంటున్న కేసీఆర్  మరి అధికారంలోకి వచ్చాక అలంపూర్, గద్వాల ప్రాంతాలకు ఎందుకు నీళ్లు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ మినిష్టర్ ఉత్తమ్​తో మాట్లాడి పాలమూరులో పెండింగ్​ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత మాది” అని అన్నారు. 

కేసీఆర్​ పక్కన ఆర్​ఎస్​పీ చేరడమేంది?

దొరల గడీలు పగలగొడ్తమని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ చెప్పారని, ఇప్పుడు ఆయన కేసీఆర్ పక్కన చేరడం పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? అని సీఎం ప్రశ్నించారు. అందుకే మంత్రి దామోదర రాజ నరసింహను ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడటానికి వెళ్లాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 

పదేండ్లు అధికారంలో ఉంటం

ఉమ్మడి ఏపీలో 1994 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 2004, 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని అన్నారు. ‘‘కేసీఆర్ మందు వేసినవో లేదో తెల్వదు. పండినవో, లేచినవో తెల్వదు. మీ కుటుంబ సభ్యులు లేసి ఉంటే టీవీ చూపించున్రి. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ తెలంగాణ గడ్డ మీద పదేండ్లు అధికారంలో ఉంటుంది. నాకు వయస్సు ఉంది. ఓపిక ఉంది.

ఎవరన్నా తోక ఆడిస్తే, తోక కత్తరించే కత్తెర కూడా ఉంది’’ అని ఆయన తెలిపారు. ‘‘ఈ వేదిక మీదుగా డీకే అరుణ, జితేందర్ రెడ్డిని ఒక్కటే అడుగుతున్నా.  2014లో  మోదీ పాలమూరుకు జాతీయ హోదా ఇస్తానని మాట ఇచ్చారు కదా, పదేండ్లుగా ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి, ఆయన తరఫున మీకు పాలమూరు ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు” అని సీఎం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో కాంగ్రెస్ 11 స్థానాలు గెలిచిందని, పాలమూరులో 12 స్థానాలు గెలిచామని సీఎం రేవంత్​ తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్తున్నారని, పాలమూరులోనూ మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్ పార్లమెంట్​స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పాలమూరు బిడ్డకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలంటే 17  ఎంపీ స్థానాల్లో కనీసం14 స్థానాల్లో గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసే అవకాశం వచ్చిందని, దానిని చేజార్చుకోవద్దని ఆయన కోరారు.

మూడు నెలల్లోనే ఎంతో మార్పు

సీఎం రేవంత్​ రెడ్డి నల్లమల, పాలమూరు ముద్దు బిడ్డ నుంచి రాష్ట్ర ముద్దుబిడ్డగా ఎదిగారు. 
3 నెలల్లో పరిపాలనలో మార్పు తీసుకొచ్చారు. దేశంలో ఏ జిల్లా ఎదగని స్థాయికి పాలమూరు ను తీసుకెళ్తారు. వేల కోట్లు ఖర్చు చేసి అద్భుతమైన పరిపాలన చేసినట్టు కేసీఆర్​ భ్రమలు కల్పించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కేసీఆర్​, కేటీఆర్, హరీశ్​ ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు కోల్పోయారు. రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించి జాతీయ స్థాయిలో రేవంత్​కు బలం కల్పించాలి.

 మంత్రి జూపల్లి

ప్రవీణ్​ కాళ్లు పట్టుకొనేస్థాయికి కేసీఆర్ 

పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణ అప్పుడు సీఎం కాగా, ఇప్పుడు రేవంత్​రెడ్డి అయ్యారు. కేసీఆర్​ సొంత పార్టీ మంత్రులు వచ్చినా​ తరిమేటోడు. ఇప్పుడు అతని ​బతుకు ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్​ కాళ్లు పట్టుకునే కాడిని వచ్చింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మేం గాడిలో పెడుతున్నాం. ఉద్దండాపూర్​​ రిజర్వా యర్ ​ముంపు బాధితులకు త్వరలో పరిహారం చెల్లిస్తాం. రూ.75 కోట్లతో పాలమూరు రీజినల్ ​రింగ్​రోడ్డు పనులకు అనుమతులు ఇచ్చాం. మూడు ‘బీ'లు (బీఆర్ఎస్​, బీజేపీ, బీఎస్పీ) కలిసినా కాంగ్రెస్​ను ఏం చేయలేవు. 

 మంత్రి కోమటిరెడ్డి

అరుదైన లీడర్లలో రేవంత్​ ఒకరు 

అరుదైన లీడర్లలో రేవంత్ ​రెడ్డి ఒకరు. ఇప్పుడిప్పు డే తెలంగాణ స్వేచ్ఛ, ఆత్మ గౌవరవంతో మళ్లీ నిలదొక్కుకుంటున్నది.. దళితులకు రూ.25 లక్షల విలువైన భూమిని పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్​దే. కానీ, గత ప్రభుత్వంలో ఆ భూముల కు రక్షణ లేకుండా పోయింది. కేసీఆర్ దళిత వ్యతిరేకి. మేం వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.  బీఎస్పీ పార్టీ మళ్లీ దొర దగ్గరికి చేరి చేయి కలిపింది. దొరకు మనకు ఎప్పుడూ పడదు.  

 మంత్రి రాజనర్సింహ

ఎడ్యుకేషనల్​ హబ్​గా పాలమూరు 

పాలమూరును ఎడ్యుకేషనల్​హబ్​గా నిలపాలన్న అకుంఠిత దీక్షతో సీఎం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాలమూరుకు ఇంజినీరింగ్​, లా కాలేజీలు కచ్చితంగా వస్తాయి. దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తారు.

ఎమ్మెల్యే యెన్నం