విజయోత్సవానికి ఓరుగల్లు రెడీ .. వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్ది పర్యటన

  • కాళోజీ కళాక్షేత్రం ఓపెనింగ్​ 
  • మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
  • ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ప్రజాపాలన విజయోత్సవ సభ 
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

హనుమకొండ/ వరంగల్, వెలుగు: రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు ఓరుగల్లు ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ సభ నిర్వహించనుండగా, సభా వేదికకు 'ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం'గా పేరు పెట్టారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరు కానుండగా, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్​ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా వేదికతోపాటు ఇతర ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు, ఇతర నేతలు సోమవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. 

లక్ష మందితో విజయోత్సవ సభ..

సీఎం రేవంత్​రెడ్డి హాజరు కానున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు లక్ష మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 50 వేల మందికిపైగా మహిళలే బహిరంగ సభకు హాజరయ్యేలా ప్లాన్​ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కళాక్షేత్రం ఓపెనింగ్, మహిళా శక్తి భవనాలకు శ్రీకారం..

హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో 4.25 ఎకరాల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం పదేండ్ల పాటు కళాక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేయగా, సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే ఛాలెంజింగ్ గా తీసుకుని దానిని ఓపెనింగ్ కు సిద్ధం చేశారు. అంతేగాకుండా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం ఇక్కడే శిలాఫలకం వేయనున్నారు. 

నేతల సంబురాలు..

సీఎం రేవంత్​రెడ్డి పర్యటనకు ముందే వరంగల్ నగరంపై వరాల జల్లు కురిపించడంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్​ పోర్టు పునరుద్ధరణకు భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేయడం, మాస్టర్​ ప్లాన్​కు ఆమోదం, అండర్​ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కేటాయించడం, కాకతీయ మెగా టెక్స్ టైల్​పార్కులో పనుల కోసం ఫండ్స్ రిలీజ్​చేయడంతో సోమవారం సంబురాలు నిర్వహించారు. మామునూరు ఎయిర్​ పోర్టు వద్ద ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్​రెడ్డి పాల్గొని సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోకు గజమాల వేసి, క్షీరాభిషేకం చేశారు. హనుమకొండ డీసీసీ భవన్​ఎదుట ఎమ్మెల్యే నాయిని ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు.