యుద్ధం ఇంకా మిగిలే ఉంది!

‘ఇంకా యుద్ధం ముగియలేదు.  ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చింది' అని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారు. ఆ  మాటలు సెప్టెంబర్​లోనూ.. మరో నాలుగేండ్ల పాటు వర్తిస్తాయి. నిజమే!  ఇంకా యుద్ధం ముగియలేదు. 2014 నుంచి  టీఆర్ఎస్/బీఆర్ఎస్ హయాంలో జరిగిన 'విధ్వంసం' నుంచి తెలంగాణ తెప్పరిల్లవలసి ఉన్నది.  

ఎన్నో గాయాల నుంచి కోలుకోవలసి ఉన్నది.  తెలంగాణ ఏర్పాటుకు ముందు కనిపించినంత  స్పష్టంగా  రాష్ట్ర  అవతరణ తర్వాత 'విధ్వంసం' కనిపించదు.  కేసీఆర్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు స్వైర విహారం చేయగా 'విధ్వంసం' ఎక్కడ జరిగిందంటూ బీఆర్ఎఎస్ నాయకులు  ఎదురుదాడికి దిగవచ్చు. ఆయన పాలనలో లబ్ధి పొందిన కొందరు 

మా మీడియా మిత్రులకు కూడా ఇది కొరుకుడుపడని అంశమే. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. సామాన్య ప్రజలు నిజం తెలుసుకోవాలని ప్రయత్నించరు. వాళ్ళు చాలావరకు భ్రమల్లోనే జీవిస్తుంటారు. తమకు ఎందుకు ఒత్తిడి అని భావిస్తుంటారు. అంతా దైవాధీనం అని సర్దుకుపోయేవారే ఎక్కువ. 

జనం గొప్పగా కనిపించే వాటి పట్ల త్వరగా ఆకర్షితులవుతారు.  గొప్పగా ఉండేవంటే జనానికి చాలా ఇష్టం.  అవి వాళ్ళను ఆశ్చర్యచకితులను చేసేంత అద్భుతంగా, విశ్వరూపంలో కన్పించాలి. ప్రభుత్వం చూపించే అద్భుతాలకు జనం బిత్తరపోవాలి. కళ్ళకు కనిపించేదే జనాన్ని కట్టిపడేస్తుంది. జనం హృదయాలను ఆ అద్భుతాలు నేరుగా తాకుతాయి. ఈ ట్రిక్కులన్నింటినీ కేసీఆర్ కాచివడబోశారని బీఆర్ఎస్ శ్రేణులు బలంగా నమ్ముతున్నవి.

కేసీఆర్ పాలనలో విధ్వంసం

పదేండ్ల పాటు కేసీఆర్ హయాంలో జరిగినదంతా బూటకమని చెప్పడానికి ఎవరూ సాహసించలేరు. కానీ,  సంక్షేమం,  అభివృద్ధి నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జరిగిందంతా 'విధ్వంసం'. పూడ్చలేని నష్టం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కళ్ళు జిగేలు మనిపించే ఫ్లైఓవర్లు, ఆకాశాన్ని అంటే అపార్ట్ మెంట్లు, విల్లాలు, ఇక రైతుబంధు.. వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్ని అమితంగా ఆకట్టుకున్నవి. ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్ కల, తెలంగాణ రాష్ట్ర సాకారంతో నెరవేరింది.  

ఆయన తెలంగాణ ప్రజలకు మొదట చూపింది వేరు. ఆచరించింది వేరు.  కోస్తా ఆంధ్ర, వలస పెట్టుబడిదారులతో,  సినీ పరిశ్రమతో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో తండ్రీ కొడుకుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసినదేమీ లేదు. కోస్తా ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం వేళ్లూనుకున్న సంగతి అందరికీ తెలుసు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఆ వర్గాలే  పదేండ్లు ఎట్లా పెత్తనం సాగించాయో,  కేసీఆర్,  కేటీఆర్  నీడలో ఆ వర్గాలు ఎట్లా విజృంభించాయో కళ్లారా చూశాం. 

సామాజిక తెలంగాణ కాకుండా 'భౌగోళిక  తెలంగాణ'కు  రాజీపడడంలోనే  కేసీఆర్,  ఆయన కుటుంబ ప్రయోజనాలు ముడిపడి ఉన్నవి.  అందుకే  చాకచక్యంగా తెలంగాణ  సమస్యనంతా సాగునీటి పారుదల సమస్యగా,  భారీ ప్రాజెక్టుల సమస్యగా కేసీఆర్  మార్చేశారు.  కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువుల  పునరుద్ధరణ వంటి చర్యలు చెరువులను కొంతమేరకు కాపాడి ఉండవచ్చు. కానీ, అందులోనూ భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలున్నవి.  కేసీఆర్  సామాజికవర్గం అప్పటిదాకా అదుపులేని  ఆకలితో ఉండింది.  కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మృగరాజ అహంకారం వారి నరనరాల్లో నాటుకుపోయింది.

తమ విమర్శలకు తామే జవాబు చెప్పాల్సిన స్థితిలో బీఆర్​ఎస్​  

 బీఆర్ఎస్  చేస్తున్న విమర్శలు, నిందలు రోజురోజుకూ ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నవి. రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు. రైతుబంధు అమలు చేయడం లేదు.  రైతు బీమా అమలు చేయడం లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. నిరుద్యోగులను మోసం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనమైంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నది.. ఇలా ప్రతిరోజూ బీఆర్ఎస్ ప్రధాన ప్రచారకర్తగా, వక్తగా  మాజీ మంత్రి  హరీశ్ రావు  రేవంత్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. 9 నెలల్లో రేవంత్ సర్కార్ 76 వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చిందో  ముఖ్యమంత్రి రేవంత్ కన్నా, ఆర్థిక మంత్రి భట్టి కన్నా కూడా  కేసీఆర్,  కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవలసి ఉన్నది. 

ఏడున్నర లక్షల కోట్ల అప్పుల భారం

మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఏడున్నర లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని మంత్రులు శ్రీధర్ బాబు, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్యులు బీఆర్ఎస్​ను చెండాడుతూనే ఉన్నారు. అయినా,  వాటిని  నిసిగ్గుగా దులిపేసుకొని బీఆర్ఎస్ నాయకులు  సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు.  నిరంతరం 'అఫెన్స్' ఆట ఆడడం కేసీఆర్ కు  ఆయన కుటుంబ సభ్యులకు చెందిన డిక్షనరీలో ఉన్నది.  'రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పనిలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసింది. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం మోపింది.  కేసీఆర్  సర్కార్  చేసిన అడ్డగోలు అప్పులకు రాష్ట్రంలో వచ్చే ఆదాయం వడ్డీ కట్టేందుకే సరిపోతున్నది' అని అనేక సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. 2023 డిసెంబర్ 7 న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా,  డిసెంబర్ 12వ తేదీ నుంచి రేవంత్ ప్రభుత్వం అప్పులు చేయటం మొదలుపెట్టిందంటూ పోస్టులు బీఆర్ఎస్  శ్రేణులు తమ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నాయి. రేవంత్, భట్టి  కేబినెట్  తమ విలాసాల కోసం అప్పులు చేయడం లేదన్న సంగతి బీఆర్ఎస్ కు తెలియదని ఎట్లా అనుకుంటాం? 

దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష చూపిన కేసీఆర్​

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో జరిగిన జలదోపిడీ కంటే,  కేసీఆర్‌‌‌‌ హయాంలోనే ఎక్కువ జరిగిందన్న విమర్శలున్నవి. రాయలసీమకు జలాల తరలింపునకు  కేసీఆర్‌‌‌‌  సహకరించారన్న నింద ఉన్నది.  బీఆర్ఎస్, -బీజేపీ మధ్య చీకటి ఒప్పందం వల్లనే  ఉమ్మడి మహబూబ్ నగర్ వంటి జిల్లాలు అభివృద్ధికి నోచుకోకుండా పోయాయన్న విమర్శలున్నవి. కేసీఆర్ పై  ఉత్తర,  దక్షిణ  తెలంగాణల మధ్య వివక్షను  ప్రదర్శించారన్న అభియోగం చరిత్ర ఉన్నంతవరకు ఉంటుంది.    తెలంగాణ సమాంతర అభివృద్దికి  'మెగా మాస్టర్ ప్లాన్  2050 విజన్' ను  సీఎం రేవంత్ రెడ్డి  రూపొందిస్తున్నారు.  

ప్రజా పాలనలో అసమ్మతికి అవకాశమే లేదు

కాంగ్రెస్  ప్రభుత్వాలలో  గతంలో ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా,  మంత్రుల్లో,  ఎమ్మెల్యేలలోనూ అసమ్మతి మొదలయ్యేది.  ఢిల్లీకి  వెళ్లి  ముఖ్యమంత్రిపై  అధిష్ఠానానికి ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పేవారు. ఈ సంస్కృతికి  రేవంత్  చెక్ పెడుతూ, తన నిర్ణయాలకు ముందుగానే అధిష్ఠానం అనుమతి తీసుకుంటున్నారు.  మంత్రులలో  చాలామంది కంటే వయసులో  రేవంత్ చిన్నవారు.  వయసులోనూ,  పార్టీలోనూ తనకంటే అనుభవం ఉన్నవారనే  ఉద్దేశంతో  మంత్రులను  సముచిత గౌరవంతో  సంబోధిస్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్  ముఖ్యమంత్రిగా ఎంతోకాలం  కొనసాగలేరని,  ఆయనకు  పెద్దగా పాలనా అనుభవం లేకపోవడం వల్లకానీ,  గ్రూపు రాజకీయాలను నెట్టుకు రాలేరని చాలామంది  భావించారు.  కానీ, రేవంత్ అందరి అంచనాలు  తలకిందులు చేస్తూ  పాలనలో తన 'మార్క్' ను ప్రదర్శిస్తున్నారు. 

సవాళ్లతో రేవంత్ సీఎం యుద్ధం

ఒకవైపు ఆర్థిక సంక్షోభం,  ఇంకోవైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడం..సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్​ను చుట్టుముట్టిన సవాళ్లు. ఆర్థిక పరిస్థితిని ముందుగా చక్కదిద్దితే తప్ప మిగతా వ్యవహారాలు నడవవు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు  నెలనెలా జీతాలివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం, సొంత పార్టీలో అసమ్మతి తలెత్తకుండా చూడడం, పరిపాలనపై  ప్రజల్లో  మంచిపేరు తెచ్చుకోవడం, అవతల  ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీకొనడం.. వంటి  సవాళ్లతో  రేవంత్ యుద్ధాన్ని కొనసాగించవలసిందే! 
 

- ఎస్.కే. జకీర్