మీరు దోచుకుంటే..మేం నీళ్లిస్తున్నం

  •     బీఆర్ఎస్, కాంగ్రెస్​కు తేడా అదే: సీఎం రేవంత్  
  •     దోపిడీ బయటపడ్తుందనే డీపీఆర్​లు దాచారు  
  •     కేసీఆర్, హరీశ్ రావుపై ముఖ్యమంత్రి ఫైర్   
  •     సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ప్రాజెక్టుల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రాజెక్టుల పేరుతో మీరు దోచుకుంటే.. మేం నీళ్లిస్తున్నం. మీకు, మాకు తేడా అదే. రూ.1,500 కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్ట్​అంచనా వ్యయాన్ని రూ.18 వేల కోట్లకు పెంచారు. దోపిడీ బయటపడ్తుందనే ప్రాజెక్టుల డీపీఆర్​లు దాచిపెట్టారు’’ అని కేసీఆర్, హరీశ్​రావుపై ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ లిఫ్ట్​ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్​హౌస్​ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి పైలాన్​ను  ఆవిష్కరించారు.

పూసుగూడెంలోని రెండో పంప్ హౌస్ ​మోటార్లకు స్విచ్చాన్ చేసి, గోదావరి నీళ్లకు పూజలు చేశారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ‘‘నా సొంత జిల్లా పాలమూరులో ప్రాజెక్టులు పడకేశాయి. నల్లొండలో ఫ్లోరైడ్​ ప్రాబ్లం ఉంది. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి ఒత్తిళ్లున్నా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీళ్లతో పాటు నిధులు పారాలని ముగ్గురు మంత్రులు కోరారు. జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఖమ్మం ఇరిగేషన్ ​స్కీమ్​లకు నిధులు కేటాయిస్తాం’’ అని హామీ ఇచ్చారు. ‘‘చెరుకు తోటలను అడవిపందులు నాశనం చేసినట్టు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్​ కుటుంబం ఆగం చేసింది. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడం కన్నా..

వాళ్లకు వచ్చే కమీషన్లపైనే కేసీఆర్, హరీశ్​రావు దృష్టి పెట్టారు. కమీషన్లు వచ్చే మోటార్లు, పంపులు కొన్నారు. కానీ వాటికి నాలుగేండ్లుగా కరెంట్​కనెక్షన్ కూడా ఇవ్వలేదు. వాళ్ల దోపిడీ బాగోతం బయటపడ్తుందనే ప్రాజెక్టుల డీపీఆర్​లను కేంద్రానికి ఇవ్వలేదు. ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదు. సిగ్గు లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. హరీశ్​రావు దూలంలా పెరిగారే తప్ప.. కాంగ్రెస్​సర్కార్ చేస్తున్న మంచి పనులను చూడడం లేదన్నారు. 

గోదారి నీళ్లతో ఖమ్మం సస్యశ్యామలం.. 

ఖమ్మంకు సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్​అంశాన్ని గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నా దృష్టికి తెచ్చారు. డిప్యూటీ సీఎం కూడా ప్రాజెక్ట్​మీద దృష్టి పెట్టారు.   సీతారామ ద్వారా ఎన్ఎస్​పీకి లింక్ చేసిన రాజీవ్​కెనాల్ తో ఖమ్మంకు పుష్కలంగా నీళ్లు ఇస్తాం.

భట్టి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి,​ ఉత్తమ్​కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు  సమీక్షలు చేసి కేవలం రూ. 90 కోట్లతో పనులు పూర్తి చేశారు. నాలుగేండ్లుగా పడావు పడి ఉన్న మోటార్లు, పంప్​లను వినియోగంలోకి తీసుకొచ్చాం. కేసీఆర్ రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి, ఒక్క చుక్క నీళ్లియ్యలేదు. పదేండ్లలో కేవలం 39శాతం మాత్రమే పనులు చేసి, 90 శాతం చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. పదేండ్లలో వాళ్లు చేయలేనిది.. మేం కేవలం ఆరు నెలల్లో చేయడంతో హరీశ్​రావు జీర్ణించుకోలేకపోతున్నారు” అని అన్నారు. 

కేసీఆర్, హరీశ్​కు గోదారి నీళ్లు పంపండి.. 

బీఆర్ఎస్ నేతలు చెప్పే చిల్లర మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గోదావరి నీళ్లను మేం చల్లుకోలేదు. గోదారమ్మే మమ్మల్ని ఆశీర్వదించింది.  దశాబ్దాల నాటి జిల్లా ప్రజల కలను సాకారం చేసే క్రమంలో సీతారామ ద్వారా నీళ్లను తెచ్చాం. తుమ్మల గారు.. రెండు సీసాల్లో గోదావరి నీళ్లను కేసీఆర్, హరీశ్​రావుకు పంపించండి. ఆ నీళ్లను ఎలా కలుపుకుంటారో వాళ్లకు తెలుసు” అని అన్నారు. 

రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి.. 

గత బీఆర్ఎస్ సర్కార్​వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘గత ప్రభుత్వం డీపీఆర్​లు ఇవ్వకపోవడం వల్లనే ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు రాలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి అనుమతులు తెచ్చాం.  త్వరలోనే సీతారామకు నీటి కేటాయింపులు సాధిస్తాం. 2026 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం” అని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల మిత్తి కడ్తున్నామని, బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే తాము అప్పులు చేయాల్సి వస్తున్నదని చెప్పారు.