నేతన్నలకూ రుణమాఫీ..రూ.30 కోట్లు మాఫీ చేస్తం : సీఎం రేవంత్​రెడ్డి

  • స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా రెండు చీరలు
  • నేత కార్మికులకు ఏడాదికి కోటి 30 లక్షల ఆర్డర్లు
  • గత సర్కారు పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించినం
  • తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్​ బాపూజీ
  • కొందరు ఎలక్షన్లు,సెలక్షన్లు, కలెక్షన్లను త్యాగంగా చెప్పుకుంటున్నరని విమర్శ
  • ఇండియన్‌‌ ఇన్​స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హ్యాండ్లూమ్‌‌ టెక్నాలజీ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు : చేనేత కార్మికులు తీసుకున్న రూ.30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు పంపిణీ చేసిందని,  ఇకపై తాము స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తామని, ఇందుకోసం నేత కార్మికులకు ఏడాదికి కోటి 30 లక్షల ఆర్డర్లు ఇస్తామని తెలిపారు.

ఇండియన్‌‌ ఇన్​స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ హ్యాండ్లూమ్‌‌ టెక్నాలజీ(ఐఐహెచ్​టీ)ని సోమవారం హైదరాబాద్​ లలిత కళా తోరణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్‌‌రెడ్డి వర్చువల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేనేత ప్రమోషన్​ కోసమంటూ సినీతారల తళుకు బెళుకులతో హంగూ ఆర్భాటాలు చేసినా నేతన్నల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని.. ఆత్మహత్యలు ఆగలేదని అన్నారు.

‘‘గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించకుండా ఆలస్యం చేసింది. కానీ, మేం రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి సిరిసిల్ల కార్మికులను ఆదుకున్నం. నేత కార్మికుల కండ్లలో ఆనందం చూడాలని కోట్ల రూపాయలబకాయిలను విడుదల చేసినం” అని రేవంత్​రెడ్డి వివరించారు.  నేతన్నలకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

63 లక్షల మందికి ఏటా రెండు చీరలు

తమ ప్రభుత్వం వస్త్రపరిశ్రమను  ఆదుకునేందుకు మహిళా సంఘాల్లోని సభ్యులకు ఏటా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించిందని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు ఇచ్చిందని, తాము మాత్రం రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఏడాదికి రెండు చొప్పున క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.

మంచి డిజైన్, క్వాలిటీ తో ముందుకు  రావాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇందుకోసం ఏడాదికి దాదాపు కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి రైతన్న, నేతన్న ఒక్కటేనని.. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు.

వచ్చే ఏడాది నుంచి స్కిల్​ వర్సిటీలో ఐఐహెచ్​టీ 

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని.. వచ్చే ఏడాది నుంచి స్కిల్స్ యూనివర్సిటీలో ఐఐహెచ్​టీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నేతన్నలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని పరిష్కరించి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చేనేతల ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి.. చేనేత అభయహస్తం లోగో ఆవిష్కరించారు.

నేతన్న చేయూతకు సంబంధించి రూ.290 కోట్ల చెక్కును చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. చేనేత పొదుపు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నామినీలకు బీమా చెక్కులు అందించారు.  ఐఐటీహెచ్ విద్యార్థులకు నెలకు రూ. 2,500 చొప్పున అందించే స్కాలర్​షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సీఎం అందజేశారు. కాగా, ఐఐహెచ్​టీ కార్యకలాపాలను తాత్కాలికంగా తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో మొదలు పెట్టారు. 

కేంద్రాన్ని ఒప్పించి ఐఐహెచ్​టీ తీసుకొచ్చినం

తెలంగాణ విద్యార్థులు ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ(ఐఐహెచ్​టీ)లో  చేరాలంటే ఒడిశా, ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని సీఎం రేవంత్​ అన్నారు. రాష్ట్రంలో ఐఐహెచ్​టీ ఏర్పాటుకు పదేండ్లుగా చర్యలు తీసుకోలేదని, ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇన్​స్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇన్​స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఏడాదే ఇన్​స్టిట్యూట్ మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మహిళా సమాఖ్య సంఘాల ఎన్నికల నిర్వహణ విషయంలో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఐఐహెచ్​టీకి కొండా లక్ష్మణ్‌‌ బాపూజీ పేరు

‘‘కొండా లక్ష్మణ్‌‌ బాపూజీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి, పదవులను కూడా త్యాగం చేశారు. కేసీఆర్​కు నిలువ నీడనిచ్చి, పార్టీ పెట్టినప్పుడు కార్యాలయ ఏర్పాటు కోసం స్థలం ఇచ్చింది కూడా  బాపూజీనే” అని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ పదవులను చేపట్టబోనని ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాజీనామా చేసిన మహామనిషి మన బాపూజీ అని కొనియాడారు. కొందరు లీడర్లు రాజీనామాలు చేయటం, ఎలక్షన్లు​ తేవటం, సెలక్షన్లు, కలెక్షన్లు​ చేసుకోవడమే త్యాగంగా చెప్పుకుంటున్నారని బీఆర్​ఎస్​ను ఉద్దేశించి ఆయన విమర్శించారు. కలెక్షన్ల ద్వారా కోట్లు గడించిన అలాంటి లీడర్లది త్యాగం ఎట్లవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌‌ బాపూజీ పేరును ఐఐహెచ్​టీకి పెడతామని సీఎం ప్రకటించారు.