భీమలింగాన్ని ఆలింగనం చేసుకున్న సీఎం రేవంత్.. సరిగ్గా అప్పుడు ఏమైందంటే..

వలిగొండ: ‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర’లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగానికి సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భీమలింగాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుండెలకు హత్తుకున్నారు. సంగమ స్థలిగా ఈ  సంగెం భీమలింగం ఉన్న ప్రాంతానికి పేరుంది. 

ఇంద్రసాగర్, చిన్నేరు వాగు, మూసీ నది.. ఈ మూడూ వలిగొండ మండలంలోని సంగెం వద్ద కలుస్తున్నాయి. ఈ ప్రదేశంలోనే ప్రాశస్త్యం కలిగిన భీమలింగం ఉంది. రాచకొండ సంస్థానాన్ని పాలించిన సింగభూపాలుడు ఈ మూసీ నదికి మధ్యలో ఈ భారీ శివలింగాన్ని ప్రతిష్టించారని భక్తులు చెబుతున్నారు.

ఇతర శైవ క్షేత్రాల్లోని శివలింగాలకు, భీమలింగానికి ఒక తేడా ఉంది. భీమలింగాన్ని దర్శించుకున్న భక్తులు ఈ శివలింగాన్ని తప్పనిసరిగా ఆలింగనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో భీమలింగం వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేస్తుంటారు.

ALSO READ :  సీఎం రేవంత్ పాదయాత్ర.. మూసీ నీటిని బాటిల్లో తీసుకుని పరిశీలించిన సీఎం

ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు రెండు చేతులు అందినట్లయితే అదే రోజు చనిపోయి మోక్షం పొంది స్వర్గానికి వెళతారని భక్తులు నమ్ముతుంటారు. భీముడంతటి వ్యక్తి కూడా ఈ శివలింగాన్ని హత్తుకుని రెండు చేతులు కలపలేకపోయారని స్థల పురాణం చెబుతుంది.